హైదరాబాద్: పాపం కాంగ్రెస్ పార్టీ! గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక విషయంలో మాత్రం బాగా వెనకబడిపోయింది. టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, కవితక్క మొత్తం బాధ్యతనంతా భుజాన వేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రంప్ కార్డ్ లాగా నిన్న కేసీఆర్ వచ్చి హైదరాబాద్ నగరానికి తాము చేసినది, చేయబోయేది అంతా ఏకరవు పెట్టి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్, రేవంత్ నిర్వహిస్తుండగా, నిన్న చంద్రబాబు నాయుడు రాకతో ఆ పార్టీ శ్రేణుల్లోకూడా ఉత్సాహమొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేసీఆర్, సీబీఎన్ లాంటి స్టార్ క్యాంపెయినర్ లేకపోవటంతో ప్రచారం చప్పగా సాగుతోంది. చివరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగే స్టార్ క్యాంపెయినర్ అవతారమెత్తి ఇవాళ ప్రచారానికి వచ్చారు. ఓల్డ్ సిటీలో పర్యటించారు. పదవులన్నీ కేసీఆర్ కుటుంబమే తీసుకుందంటూ టీఆర్ఎస్‌ను దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ అన్నీ అబధ్ధాలే చెబుతున్నారని విమర్శించారు.
ఏది ఏమైనా తెలంగాణలో కరిష్మా ఉన్న నాయకుడెవరూ లేకపోవటం పెద్ద లోటే. పాపం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కాళ్ళకు బలపాలు కట్టుకుని బాగానే తిరుగుతున్నారు, పనిచేస్తున్నారుగానీ స్టార్ క్యాంపెయినర్ ఎవరైనా ఉంటే ఫలితం మరింత ఇనుమడించేది. కనీసం ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, నటుడు చిరంజీవినైనా వారు రంగంలోకి దించాల్సింది. ఒకవేళ అడిగినా కూడా 150వ సినిమా హడావుడిలో ఉండి ఆయన తిరస్కరించారేమో తెలియదు.