ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం చాలా కష్టమనీ, మాటలు చెప్పడం ఎన్నైనా చెప్పొచ్చుగానీ, ఫలితాలు రాబట్టడం కొన్ని ప్రభుత్వాల వల్లే జరుగుతుందనీ, దానికి మారు పేరు టీడీపీ ప్రభుత్వం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రకాశం జిల్లాలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి మాట్లాడుతూ… తానూ పాదయాత్ర చేశాననీ, కానీ ఒక పవిత్రమైన భావనతో చేశామన్నారు. ఈయన పాదయాత్ర చూస్తుంటే… కొన్ని రోజులు చేయడం, కొన్ని రోజులు సెలవులు తీసుకోవడం చేశారన్నారు.
అయితే, ప్రజల దగ్గరకు పోవడానికి ఎప్పుడు వెళ్లినా తప్పులేదనీ, దాన్ని తాను తప్పుబట్టడం లేదనీ, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లొచ్చనీ, కాకపోతే అలా చేసేదాన్ని పాదయాత్ర అని అనరు అన్నారు చంద్రబాబు చెప్పారు. చిత్తశుద్ధి లేని యాత్రలు ఎన్ని చేసినా ఏం ప్రయోజనమని వ్యాఖ్యానించారు. రోజుకి 8 కి.మీ. నడిస్తే దాన్ని యాత్ర అంటారా అనీ, సాయంత్రం ఏడు గంటల తరువాత ఏనాడైనా జగన్ పాదయాత్ర చేశారా అన్నారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా గతంలో యాత్ర చేశాననీ, అప్పట్లో తనకు కాలుకి చిన్న సమస్య వస్తే, ఇప్పటికీ అది తగ్గలేదనీ చంద్రబాబు చెప్పారు. వారం వారం ఇంటికి వెళ్లిపోతూ చేసే యాత్రకు పవిత్రత ఎక్కడ ఉంటుందని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఏరకంగా అనుభవం లేని వ్యక్తి పెద్దపెద్దవన్నీ చెబుతున్నాడని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారనీ, అవినీతి గురించి వారు మాట్లాడుతున్నారన్నారు. తండ్రి (వైయస్ రాజశేఖర్ రెడ్డి)ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడి, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారనీ, రాష్ట్రం పరువూ పరపతి పోయిందనీ, ఈయన (జగన్) చెప్పిన మాటలు విని, దానికి అనుగుణంగా పనిచేసిన, ఈయనతోపాటు ఎంతోమంది కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సీఎం. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాదు, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా తాము చేశామన్నారు చంద్రబాబు. ఈరోజున ఎక్కడికి వెళ్లినా మళ్లీ మీరే రావాలంటూ ప్లకార్డులు పట్టుకుని అందరూ నినాదాలు చేస్తున్నారంటే కారణం తాను చేసిన కష్టానికి ఫలితమన్నారు.
వాస్తవానికి, జగన్ పాదయాత్ర ప్రతీ గురువారం మధ్యాహ్నానికే పూర్తయ్యేది. యాత్ర ఎక్కడున్నా… అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చేసేవారు. మర్నాడు, అంటే శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. ఇక, పండుగ సెలవులు, వేర్వేరు కార్యక్రమాల పేరుతో పాదయాత్రకు సెలవులు చాలానే పెట్టారు. గతంలో యాత్రలు చేసిన రాజశేఖర్ రెడ్డిగానీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇలా విరామాలూ విశ్రాంతులూ తీసుకుని, వ్యక్తిగత పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా వారు చెయ్యలేదు.