అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ముందుగా లోక్ సభలో మంగళవారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే, రాజ్యసభలో దీని ఆమోదంపై విపక్షాల నుంచి తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉందనే విశ్లేషణలు చాలా వినిపించాయి. కానీ, ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సవరణలూ వీగిపోయాయి. ఈ బిల్లుకు అనుకూలంగా 165 మంది సభ్యులు ఓటేశారు. ఏడుగురు సభ్యులు వ్యతిరేకించారు. ఇక, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపాదనకు కూడా రాజ్యసభలో మద్దతు లభించలేదు. కేవలం 18 మంది సభ్యులు మాత్రమే దీనికి అనుకూలంగా మద్దతు పలికారు, 155 మంది వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందనీ, కాబట్టి ఈ రిజర్వేషన్లు ప్రైవేటు రంగంలో కూడా ప్రవేశపెట్టాలంటూ కోరిన సవరణకు కూడా రాజ్యసభలో వీగిపోయింది. మంగళవారం నాడు లోక్ సభ ఆమోదించిన బిల్లును యథాతథంగా రాజ్యసభ కూడా ఆమోదించింది.
ఈబీసీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి మద్దతు రావడమంటే సామాజిక న్యాయం గెలిచినట్టే అయిందన్నారు. దీనిపై జరిగిన చర్చను గొప్ప చర్చగా ఆయన అభివర్ణించారు. 124వ రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో ఆమోదం లభించడం సంతోషంగా ఉంటూ ఒక ట్వీట్ ద్వారా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈబీసీ బిల్లుపై ఉభయ సభల్లోనూ సభ్యులు తమ అభిప్రాయాలను మనస్ఫూర్తిగా వెల్లడించారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
నిజానికి, ఈ బిల్లును ఇలా ఎన్నికల ముందు కాకుండా, కొన్నాళ్లు ముందు ప్రవేశపెట్టి ఉంటే మోడీ సర్కారు చిత్తశుద్ధిని అందరూ మెచ్చుకునేవారు. కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి ముందస్తు ప్రకటనా లేకుండా, రాజకీయ ఏకాభిప్రాయ సేకరణ ఊసెత్తకుండా.. హటాత్తుగా బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లుపై సభ్యులు మనస్ఫూర్తిగా మాట్లాడారని ప్రధాని మెచ్చుకున్నారుగానీ… ఆ బిల్లు గురించి అధ్యయనం చేసే సమయం కూడా సభ్యులకు ఇవ్వలేదు. హుటాహుటిన సభలో ఆ బిల్లు పేపర్లు ఇచ్చేశారు, వెంటనే చర్చించేద్దాం అంటూ సిద్ధపడిపోయారు, ముందురోజు లోక్ సభ, మర్నాడు రాజ్యసభ… అంతే, కీలకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును కూడా ఇలా హడావుడిగా ఆమోదింపజేసుకున్నారు. బిల్లు కచ్చితంగా మంచిదేగానీ… దానిపై మరింత లోతైన చర్చ జరగనీయకపోవడం, సభ్యులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కీలకమైన బిల్లులు పార్లమెంటులోకి తెచ్చిపెట్టేయడం అనే సంస్కృతి కచ్చితంగా సమర్థనీయం కాదు.