కోడికత్తి కేసు కలకలం మళ్లీ ప్రారంభమైంది…నిన్న మొన్నటి వరకు విశాఖపట్నం లో ఉన్న కేసు విజయవాడలోని ఎమ్.ఎస్.జె కోర్టుకు బదిలీ కానుంది. ఎన్ఐఎ అధికారులు బుధవారం విజయవాడ కోర్టులో రిక్విజేషన్ దాఖలు చేశారు. తాము రిజిష్టర్ చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను కూడా కోర్టుకు సమర్పించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్ఐఎ, హైదరాబాద్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్.ఐఆర్ పై విచారించేందుకు ఎన్ఐఎ బృందం విశాఖపట్నం కూడా వెళ్లింది. కానీ అక్కడి పోలీసులు డీజీపీ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున… వివరాలు ఇవ్వలేమని చెప్పేశారు. దీంతో ఎన్ఐఎ విజయవాడ కోర్టులో రిక్విజేషన్ దాఖలు చేసింది. తమకు రికార్డు ఇప్పించాలని కోరింది.
విశాఖపట్నంలో ఏడవ అదనపు కోర్టు ఈ కేసును విచారిస్తుండటంతో ఇక్కడ కోర్టు విశాఖపట్నం ఏడవ కోర్టుకు రికార్డును పంపాలని కోరింది. తమకు డీజిపి నుంచి అనుమతి ఇంకా రాలేదని అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కోర్టుకు కూడా సమాచారం అందించారు . విశాఖపట్నంలో ఎన్ఐఎ అధికారులు వారం రోజుల నుంచి మకాం వేసినప్పటికీ అధికారుల నుంచి స్పందన కనిపించకపోవడంతో తమ డిజిగ్నేటెడ్ కోర్టు అయిన విజయవాడ మెట్రో పాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో ఎఫ్.ఐ.ఆర్ ను అందించి రికార్డును విశాఖపట్నం నుంచి తెప్పించాలని రిక్విజేషన్ దాఖలు చేసింది.
నిజానికి లా అండ్ ఆర్డర్ రాజ్యాంగ పరంగా… రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. వాటిని సొంతంగా.. కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకే… ఎన్ఐఏ కేసు నమోదు చేసింది కాబట్టి.. సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా లేదు. కోర్టు ఆదేశాలివ్వక ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక కుట్ర ఉందని.. ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రకారమే… ఏం చేయాలన్నదానిపై.. చర్చలు జరుపుతోంది. నిరసన తెలియజేస్తూ.. లేఖ రాయాలని నిర్ణయించుకుంది కానీ… కేసు పత్రాలు మాత్రం.. ఎన్ఐఏ చేతికి వెళ్లనివ్వడం లేదు.