ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీడ్ క్యాపిటల్ గా పిలుస్తున్న స్టార్టప్ ఏరియా అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్నాయి. అమరావతి ఆర్ధికాభ్యున్నతికి చోదకశక్తిలా ఉపయోగపడుతుందన్న ఉద్దేశ్యంతో ఏపీసీఆర్డీయే స్టార్టప్ ఏరియాను ప్రతిపాదించింది. రాజధానిలోని అత్యంత కీలక ప్రదేశంలో, కృష్ణానదీ తీరాన, సీడ్ యాక్సెస్ రోడ్డు- గవర్నమెంట్ కాంప్లెక్స్‌లకు సమీపాన దీనికోసం 1691 ఎకరాలను కేటాయించారు. ఈ భూమిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పరచడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఆర్థిక సంస్థలను ఇక్కడికి రప్పించి ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా చేయాలన్నది లక్ష్యం. దీని వల్ల రాజధాని ఆదాయం పెరగడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భూములను ఆకర్షణీయమైన రీతిలో అభివృద్ధి పరచి, మంచి ధరలకు విక్రయించే బాధ్యత కూడా స్టార్టప్ ఏరియా డెవలపర్‌దే. ఈ రూపంలో లభించే ఆదాయంలో 42 శాతాన్ని సింగపూర్ కన్సార్షియం సీఆర్డీఏకు ఇస్తుంది. స్టార్టప్ ఏరియా రాకతో ఒక్క అందులోనే కాకుండా అమరావతి వ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి.
మొత్తం 3 దశల్లో, 15 సంవత్సరాల కాలవ్యవధిలో సీడ్ క్యాపిటల్‌ను అభివృద్ధి పరచాలని ఒప్పందం చేసుకున్నారు. తొలి దశలోని 650 ఎకరాలను 5 ఏళ్లలో తీర్చిదిద్దాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఈ దశలో ఒక్కొక్కటి 8 లక్షల చదరపుటడుగుల ఆఫీస్ స్పేస్‌ను నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు… ఆ పనులు ప్రారంభిస్తున్నారు. మొదటగా వెల్కం గ్యాలరీని నిర్మాణం ప్రారంభిస్తున్నారు.
ఇప్పటి వరకు సింగపూర్ సంస్ధలు 40 దేశాల్లో స్టార్ట్ అప్ ఎరియాలను అభివృద్ది చేశాయి. ఇవన్నీ లాభాల్లో ఉన్నాయి. ఏపీ సీడ్ క్యాపిటల్ అభివృద్ధిలో వచ్చే లాభాల్లో 45 శాతం ఏపీకి అందుతాయి.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో పాటు 90 మందితో కూడిన బృందం అమరావతికి వచ్చింది. వీరంతా స్టార్టప్ ఎరియా పనులు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ పేరుతో కలసి పనిచేస్తారు. నిర్మాణం జరుపుకోనున్న వెల్కం గ్యాలరీలో 4వేల చదరపు మీటర్ల విస్తిర్ణం ఉంటుంది. సీడ్ క్యాపిటల్ పనుల్లో భాగంగా 50 ఎకరాల విస్తిర్ణంలో తోలి దశ పనులు ప్రాంరంభింనున్నారు అందులో.. కన్వెన్షన్ సెంటర్, పార్కులు తదితర నిర్మాణాలు ఉండనున్నాయి. రాజధానిలో ఇప్పటికే ప్రభుత్వ భవనాలు పనులు శరవేగంగా నడుస్తున్నాయి. సీడ్ క్యాపిటల్ పనులు కూడా ప్రారంభం కానుండటంతో.. మరింత వేగంగా.. అమరావతికి ఆకృతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.