ఇక కుల రాజకీయాలకు భాజపా తెర తీసింది. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంతో… దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు సిద్ధమౌతోంది. సరిగ్గా ఎన్నికలకు నాలుగు నెలల ముందే అగ్రవర్ణాలపై అభిమానం ప్రదర్శించడం కేవలం ఓటు బ్యాంకు రాజకీయం అనేది ముమ్మాటికీ నిజం. ఒకవేళ నిజంగానే వారిపై మొదట్నుంచీ చిత్తశుద్ధి ఉంటే… గడచిన నాలుగేళ్లలో ఎప్పుడైనా ఈ అగ్రవర్ణాల పేదలు మోడీ సర్కారుకు ఎందుకు గుర్తుకురానట్టు..? ఈ విషయాన్ని వదిలేసి… కాపుల రిజర్వేషన్ల విషయంలో ఏపీ సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నించారు భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.
ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిజంగానే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే… హర్యానా, మహారాష్ట్రల మాదిరిగా చట్టం చేయాల్సి ఉందన్నారు. ఆయా రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చి చట్టం చేశాయన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు అలాంటి ప్రయత్నమేదీ చెయ్యకుండానే నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లు వల్ల బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి వర్గాలతోపాటు కాపులకు కూడా మేలు జరుగుతుందన్నారు. ఈ బిల్లుపై కూడా పార్లమెంటులో టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందనీ, అగ్రకులాల పేదలకు మేలు చేయడం ఆ పార్టీకి ఇష్టం లేదని విమర్శించారు.
జీవీఎల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే…. భాజపా మాదిరిగా ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలనుకుంటే, కాపుల రిజర్వేషన్లపై ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా, అంటే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసేవారు! కానీ, అలా చెయ్యలేదు. మంజునాథన్ కమిటీ వేసి, దాని నివేదిక వచ్చిన తరువాత అసెంబ్లీలో చర్చపెట్టి, ఆ తరువాత తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించారు. కానీ, దానిపై కేంద్రం ఇంతవరకూ స్పందించలేదు. కేంద్రమే ఇంకా ఆమోదం తెలపలేదు. ఆంధ్రా ఒక్కటే కాదు.. తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా ఇలాంటి రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలు చేసిన తీర్మానాలు కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా… అన్నింటినీ పక్కన తోసేసి… రాష్ట్రాలకు క్రెడిట్ దక్కకూడదన్న ఉద్దేశంతో ఈబీసీ బిల్లు తీసుకొచ్చారు. ఏపీ సర్కారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మంత్రి వర్గంలోప్రాధాన్యత కల్పించింది. రిజర్వేషన్లపై సమగ్ర అధ్యయనం చేయించింది. ఇవన్నీ జీవీఎల్ ఆంధ్రాకి వలస రాకముందు జరిగిన పరిణామాలు కాబట్టి, ఆయనకి తెలిసే అవకాశాలు లేవు.