వైఎస్ఆర్ సి పి నేత మరియు హీరోయిన్ రోజా అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఆమె చేసే వ్యాఖ్యలు పలుమార్లు పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టడమే కాకుండా, నంద్యాల ఉప ఎన్నికల లాంటి కొన్నిసందర్భాలలో పార్టీ ని కోలుకోలేని దెబ్బతీశాయి కూడా. ఇప్పుడు రోజా మరొకసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాదయాత్ర ముగిసింది. ఆ సందర్భంగా ఆయన తిరుమలకు వెళుతున్నారు. తిరుపతిలోను, రేణిగుంట లోను పలువురు నేతలు, ఇంకా చాలామంది అభిమానులు జగన్ ని కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, 2014లో రకరకాల కారణాల వల్ల ప్రజలు పొరపాటు నిర్ణయం తీసుకున్నారని, జగన్ కి బదులుగా చంద్రబాబును గెలిపించి పొరపాటు చేశారని అన్నారు. అక్కడితో ఆగకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి, 2019 ఎన్నికల్లో ప్రజలు అలాంటి పొరపాటు చేయరని తాను అనుకుంటున్నానని, ఒకవేళ జగన్ ని గెలిపించకుండా ప్రజలు తప్పు చేస్తే గనుక ప్రజలను ఎవరూ కూడా కాపాడలేరు అని రోజా వ్యాఖ్యానించారు.
రోజా వ్యాఖ్యలు చూసిన ప్రజలు దాదాపుగా విస్మయం చెందారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల దే నిర్ణయం. పైగా తలపండిన రాజకీయ విశ్లేషకుల కంటే, మహా మహా మేధావుల కంటే ప్రజలు మరింత వివేకంతో ఓటు వేస్తారని, మరింత విజ్ఞతతో వ్యవహరిస్తారని గతంలో పలు ఎన్నికలలో రుజువైంది. ఏది ఏమైనా ఓటు వేసే ప్రజలను అభ్యర్థించింది పోయి ఓటు వేయకపోతే మీకే నష్టం, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అన్నట్టుగా రోజా చేసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి.