ఎన్నికల వేడి మొదలవడంతో రాష్ట్రంలో నాయకుల సందడి కూడా మొదలైంది. రానున్న కొద్ది రోజులలో తెలుగుదేశం పార్టీలో కి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చేరడానికి సిద్ధమవుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. చంద్రబాబు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్న నేతలలో ప్రముఖంగా సబ్బం హరి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొణతాల రామకృష్ణ ఉన్నారు. వీరే కాకుండా మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఆదిశేషగిరిరావు ఎప్పటి నుండో వైఎస్ఆర్సిపి కి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే పార్టీతో విభేదాలు రావడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆదిశేషగిరిరావు ని పార్టీలోకి చేర్చుకునే విషయంలో చంద్రబాబు కూడా సన్నద్ధత తెలిపినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడైన గల్లా జయదేవ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉంటూ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పలుమార్లు గళమెత్తి ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావుకు కూడా బాబు వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం రాలేదని తెలుస్తోంది.
ఇక సబ్బం హరి కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి, జగన్ కు మద్దతుగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా జగన్ కి దూరమయ్యాడు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ని కలిపి ఉంచడానికి న్యాయపరమైన పోరాటం చేసిన నేతల లో సబ్బం హరి ముందు వరుసలో ఉన్నారు. పైగా గత కొంతకాలంగా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ పరంగా కూడా సబ్బం హరి ని చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లుగా తెలుస్తోంది.
అయితే ఆదిశేషగిరిరావు సబ్బంహరి ల చేరికకు బాబు వైపు నుండి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వస్తే కొణతాల రామకృష్ణ విషయంలో మాత్రం ఇంకా ఏదీ తేలినట్టుగా లేదు. కొణతాల రామకృష్ణ వైపునుండే ఆలస్యం జరుగుతోందని, టిడిపిపై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ సంప్రదింపులు జరుపుతూ ఒక వైపు, అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాలా వద్దా అన్న సందిగ్ధతతో పలువురితో చర్చలు మరొకవైపు కొణతాల చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొణతాల రామకృష్ణ కూడా ఒకప్పుడు జగన్ వెంట నడిచిన నాయకుడే. కానీ జగన్ నుంచి విడిపోయాక ఉత్తరాంధ్ర సమస్యల గురించి గళం ఎత్తుతూ ఉన్నారు. కొణతాల రామకృష్ణ చేరితే ఉత్తరాంధ్ర లో పార్టీ ఇంకాస్త బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ ముగ్గురు నేతల తో పాటు మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల మధ్య 2019లో పొత్తు ఉంటుందా ఉండదా అన్న అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తూ, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది.