తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 120 నియోజకవర్గాలకు చెందిన టిక్కెట్లను.. ముందుగానే ప్రకటిస్తారంటూ.. జరిగిన ప్రచారం… ఉత్తదేనని తేలిపోయింది. చంద్రబాబు ఇప్పుడిప్పుడే ఎలాంటి టిక్కెట్ల ప్రకటనా చేయడం లేదని… టీడీపీ వర్గాలు తాజాగా చెప్పుకొస్తున్నాయి. కారణం ముఖ్యమంత్రికి తీరిక లేకపోవడమేనని చెప్పుకొస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ నెల 11వ తేది వరకు జన్మభూమి, ఆ తరువాత 20వతేది వరకు సంక్రాంతి సెలవులు, ఆ తర్వతా దావోస్ పర్యటన, ఫిబ్రవరిలో అమరావతిలో ధర్మపోరాట దీక్ష ఉంది. నీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ టిక్కెట్ల కసరత్తు చేయడం చంద్రబాబుకు కష్టంగా ఉన్న కారణంగా.. టిక్కెట్లను ప్రకటించడం లేదని… పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
అయితే టీడీపీ నేతలు మాత్రం 120 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని… చెబుతున్నారు. సుమారు 70 నియోజకవర్గాల వరకు సిట్టింగ్ లను ఎంపిక చేస్తున్నప్పటికీ మిగతా నియోజకవర్గాల్లో ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న ప్రాంతాలలో వారిని మార్చాల్సిందేనని నిర్ణయానికొచ్చారు. వారితో మాట్లాడటం కూడా ప్రారంభించారు. ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించి తీరుతుందని, ఆ తరువాత తాను ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తానని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఇందులో కొంతమంది సంతృప్తి చెందుతున్నప్పటికీ, మరికొంతమంది మాత్రం చివరి నిముషం వరకు ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగించిన సందర్భంగా జాబితాను ప్రకటిస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. అయితే తెలుగుదేశం పార్టీలో 30 శాతం మందిని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని సమాచారం అందడంతో అసంతృప్తిగా ఉన్న వారిని కొన్ని నియోజకవర్గాల్లో తమ వైపుకు తిప్పుకోవాలని అనుకుంటోంది. ఈ విషయం తెలియడంతో తెలుగుదేశం కూడా అప్రమత్తమైంది. అభ్యర్ధుల జాబితా ముందుగానే ప్రకటిస్తామని, ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించడంతో వైసిపి కూడా తెలుగుదేశం జాబితా కోసం ఎదురుచూస్తోంది. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఖరారు చేసిన అభ్యర్థులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి.. పని చేసుకోవాలంటున్నారు. అధికారిక ప్రకటన మాత్రం… ఆలస్యం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి మూడో వారంలో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.