బయోపిక్‌ల జమానా నడుస్తోంది. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవితాలు తెరపై కాసుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని బయోపిక్‌లు బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టించాయి. ఇంకొన్ని దారిలో ఉన్నాయి. మరికొన్ని సెట్స్‌పైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. చర్చల దశలో ఉన్న బయోపిక్‌లలో `శ్రీదేవి` బయోపిక్ ఒకటి. బోనీకపూర్ ఈ సినిమా తీయబోతున్నాడని, అందుకు తగిన సరంజామా అంతా సిద్ధమైందని, దర్శకుడు ఇతర వివరాలు ప్రకటించడమే తరువాయి అని బాలీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి. శ్రీదేవి పేరుని టైటిల్‌గా రిజిస్టర్ చేయించడంతో ఈ గాసిప్పులు మరింతగా ఊపందుకున్నాయి.
వీటిపై బోనీకపూర్ తొలిసారి క్లారిటీ ఇచ్చాడు. శ్రీదేవి బయోపిక్ తీయాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని.. గాసిప్పులకు తెరలు దించేశాడు. ”ఇంత వరకూ మేం శ్రీదేవి బయోపిక్ గురించి ఆలోచించలేదు. కథ సిద్ధమైందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలైనా రావొచ్చు” అన్నాడు బోనీ. మరి టైటిల్ ఎందుకు రిజిస్టర్ చేయించారు? అని అడిగితే.. ”కాపీ రైట్సమస్య ఈ రోజుల్లో చాలా ఉంది. ముందు జాగ్రత్తగా టైటిల్‌ని రిజిస్టర్ చేయించాం” అని టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
శ్రీదేవి బయోపిక్‌లో హాట్ కేకులా అమ్ముడుపోయే విషయాలు చాలా ఉన్నాయి. శ్రీదేవి బాల్యం, కథానాయికగా ఎదిగిన తీరు ఇవన్నీ.. ఆసక్తిని రేకెత్తించే విషయాలే. శ్రీదేవి మరణం అయితే అంతుపట్టని మిస్టరీ. ఇవన్నీ బయోపిక్‌లో ఇమడ్చగలిగితే.. శ్రీదేవి బయోపిక్ కమర్షియల్‌గా ఓ కుదుపు కుదిపే అవకాశం ఉంది. దాన్ని బోనీకపూర్ ఎందుకు వదులుకుంటాడు? ఇప్పటికైతే శ్రీదేవి బయెపిక్ ఆలోచన లేదంటున్న బోనీ.. భవిష్యత్తులో ఆ దిశగా ఆలోచించే అవకాశాలు చాలా ఉన్నాయి.