పెన్షన్లను పెంచుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అనూహ్యమనే చెప్పాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను రూ. 2 వేలు చేస్తూ సీఎం ప్రకటించడంతో టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఓపక్క కేంద్రంతో వైరం ఉన్నా, ఆర్థికంగా రాష్ట్రం లోటుపాట్లలో ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవడం ఒకరకంగా సాహసోపేతమైందే అనడంలో సందేహం లేదు. తాజా నిర్ణయంతో ఏటా దాదాపు రూ. 13 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచీ సంపూర్ణ మద్దతు వస్తోందనడంలో సందేహం లేదు. ఇక, ప్రతిపక్ష పార్టీ వైకాపాకి ఇది కచ్చితంగా ఊహించని షాక్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామంటూ పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. కానీ, ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వారికి అర్థం కాని పరిస్థితిని సృష్టించింది!
పెన్షన్లు పెంచుతూ టీడీపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మరో డ్రామా అంటూ విమర్శిస్తోంది వైకాపా! జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయం సాధించిందనీ, నవరత్నాల్లో భాగంగా వృద్ధులూ వికలాంగుల పెన్షన్లను పెంచుతామంటూ హామీ ఇచ్చారనీ వైకాపా వర్గాలు అంటున్నాయి. జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యాక ఈ నిర్ణయం అమలు చేస్తా అన్నారు. అయితే, ఈ పింఛెను హామీ ప్రజల్లోకి బలంగా వెళ్లిందనీ, జగన్ యాత్ర వల్లనే ఇప్పుడు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చిందని టీడీపీకి వచ్చిందని వైకాపా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే పెన్షన్లను పెంచేందుకు టీడీపీ సర్కారు సిద్ధమైందనీ, దీన్ని చంద్రబాబు చూపిస్తున్న మరో డ్రామాగా సర్వత్రా చర్చ ప్రారంభమైందంటూ వైకాపా మీడియాలో కథనాలు మొదలుపెట్టేసింది.
ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలన్నీ వైకాపాకి డ్రామాలుగానే కనిపిస్తాయి. మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో గిన్నీస్ రికార్డు నెలకొల్పితే అదీ డ్రామా అన్నారు. సింగపూర్ నుంచి ప్రముఖులు అమరావతికి వచ్చిన సందర్భాన్ని కూడా నాటకమే అన్నారు. ఇప్పుడు పేదలకు ఉపయోగపడే పెన్షన్ పెంపును కూడా నాటకమే అంటున్నారు! అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు నాటకాలైతే… అధికారంలోకి వస్తారో రారో తెలియని ఒక పార్టీ ఇస్తున్న హామీలను ఏమనాలి..? పోనీ, పెన్షన్లను పెంచాలంటూ ప్రభుత్వంపై వైకాపా ఒత్తిడి పెంచి, ఏదైనా పోరాటం చేసిందా..? అలా చేసి ఉంటే ఈరోజున విమర్శలు చేయడానికి కొంత నైతిక హక్కు ఉండేది.