నవ్యాంధ్ర రాజధాని అమరావతి అనుసంధానానికి నిర్మించే పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణానది పై పవిత్ర సంగమం వద్ద నుంచి రాజధానిని కలిపే ఐకానిక్ బ్రిడ్జికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు, కోల్కతా, చెన్నై జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు, ప్రయాణికులు ఈ ఐకానిక్ బ్రిడ్జిపై నుంచి నేరుగా రాజధానికి అమరావతికి చేరుకోవానితి అవకాశం ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమం లాంఛనంగానే నిర్వహిస్తున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పటికే పనులు ప్రారంభించింది.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం నుంచి గుంటూరు జిల్లాలో రాజధానిలోని తుళ్లూరు మండలం లింగాయపాలెం వరకు ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఆరు లైన్ల తో 3.20 కిలోమీటర్ల మేర ఈ వంతెన ఉంటుంది. ఇందులో 2. 72కిలోమీటర్లు బ్రిడ్జి పొడవు కాగా, 0.48కిలోమీటర్లు కేబుల్ పోర్షన్ ఉంటుంది. రెండు మీటర్ల డయాతో ఐకానిక్ పోర్షన్ కు సంబంధించిన ఫైల్ ఫౌండేషన్ ను వేస్తున్నారు. బ్రిడ్జికి రెండు వైపులా 2.5మీటర్ల నడక దారి ఉంటుంది. భారతదేశంలోనే అతి ఎత్తైన 170మీటర్ల పైలాన్ ఈ బ్రిడ్జిలో ఉంటుంది. ఈ బ్రిడ్జిని 24నెలల్లో నిర్మించాలని ఎల్ అండ్ టీ కి ప్రభుత్వం గడవు విధించింది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ ఐకానిక్ బ్రిడ్జికి రూపకల్పన చేశారు. తెలుగు వారి సొంతమైన కూచిపూడి నృత్య భంగిమలో ఈ ఐకానిక్ బ్రిడ్జికి రూపకల్పన చేశారు. నిర్మాణ సంస్థ కృష్ణానదిలో సాయిల్ టెస్టింగ్ ను ఇప్పటికే పూర్తి చేసింది. రెండేళ్ళ కాల వ్యవధిలో ఈ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. వివిధ ప్రాంతాల నుంచి రాజధాని ప్రాంతానికి వచ్చే వారికి దాదాపు అరవై కిలోమీటర్ల దూరం తగ్గనుంది.