హైదరాబాద్: సోలార్ ప్యానెల్ కుంభకోణంతో అట్టుడుకుతున్న కేరళలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కింది కోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై కేరళ హైకోర్ట్ స్టే ఇచ్చింది. దీనితో ముఖ్యమంత్రికి స్వల్ప ఊరట లభించినట్లయింది.
సోలార్ ప్యానెల్ కుంభకోణంలో రెండో నిందితురాలైన సరితా నాయర్ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి ఒక మధ్యవర్తి ద్వారా రు.1.90 కోట్లు ఇచ్చినట్లు బుధవారంనాడు ఎంక్వైరీ కమిషన్ ముందు సాక్ష్యం చెప్పటంతో వివాదం రాజుకుంది. విద్యుత్ శాఖ మంత్రి మహమ్మద్‌కు కూడా రు.40 లక్షలు ఇచ్చినట్లు సరిత కమిషన్‌కు చెప్పింది. దీనితో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. మరోవైపు ఇవాళ ట్రివేండ్రంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు నిర్వహించిన ఆందోళన హింసాత్మక రూపు దాల్చింది. ఆందోళనకారులను చెదరగొట్టటానికి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. బీజేపీ యూత్ వింగ్ కార్యకర్తలు కూడా ఆందోళన నిర్వహించారు.