నాని తొలి సారి బ్యాటు పట్టాడు. గ్రౌండ్లో దిగి సిక్సర్లూ, ఫోర్లూ బాదాడు. .. ఇంతా `జెర్సీ` సినిమా కోసం. నాని తొలిసారి ఓ క్రికెటర్‌గా నటిస్తున్న సినిమా ఇది. గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా టీజర్ విడుదలైంది. అర్జున్ అనే క్రికెటర్ కథ ఇది. అతనికి 36 ఏళ్లు. రిటైరైపోయి, పిల్లల్ని ఆడించుకునే వయసులో… క్రికెటర్‌గా ఎదగాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటాడు. అన్నిటా ఓటమే. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా విజేతగా నిలిచాడన్నదే.. `జెర్సీ`కథ. ఈ కథ ఎలా సాగబోతోందో.. జెర్సీ టీజర్లో చూపించాడు దర్శకుడు. నాని సినిమా అంటే వినోదం ఆశిస్తాం. ఈసారి మాత్రం నాని ఎమోషన్ని నమ్ముకున్నాడనిపిస్తుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలు బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తాయి. లేదంటే అక్కడ ఆడిన సినిమాని తెలుగులో మనం రీమేక్ చేస్తుంటాం. అలాంటిది తొలిసారి.. పూర్తి క్రీడా నేపథ్యంలో ఓ సినిమా రావడం, అందులో.. నాని నటించడం విశేషమే. నానిని మినహా మిగిలిన పాత్రల్ని కేవలం గొంతుల ద్వారానే పరిచయం చేయడం, డైలాగుల్లో డెప్త్ కనిపించడం ఈ టీజర్‌ని ప్రత్యేకంగా నిలిపాయి.