ఎన్నికల్లో పోటీకే కాదు.. ఏపీ బీజేపీ నుంచే వెళ్లిపోవాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. వేరే పార్టీలో చాన్సిస్తే.. లాంగ్ జంప్ చేయడానికి.. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలా చాన్స్ రాని వారు.. వచ్చినా .. బీజేపీ ఐడియాలజీతో సింక్ కాదనుకున్న వారు.. రాజకీయ సన్యాసానికి సిద్ధమయ్యారు. కానీ.. ఓ ఆరు నెలల కిందటి వరకూ.. ఎన్నికల్లో పోటీ చేయనని.. ఆరోగ్యం సహకరించదని… ఏదైనా గవర్నర్ లాంటి పోస్ట్ అయితే…రెడీ అన్న కృష్ణంరాజు.. ఇప్పుడు ఓపిక తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తరపున.. పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న బీజే్పీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు కృష్ణంరాజు. అక్కడ మీడియా కనబడితే తన సంసిద్ధతను తెలిపారు. పనిలో పనిగా మోడీని తెగ పొగిడేశారు కృష్ణం రాజు. ఆయన ప్రసంగం వింటే మరోసారి గెలిచినంత సంతోషంగా ఉంటుందట.. రెబల్ స్టార్ కి.
గతంలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉన్నప్పుడు బీజేపీ తరపున పోటీ చేసి.. గెలిచి .. కేంద్రమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన కృష్ణం రాజుకు ఆ తర్వాత రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పీఆర్పీ పెట్టినప్పుడు.. ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు రాజమండ్రి లోక్ సభ టిక్కెట్ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. ఆ తర్వాత పీఆర్పీ నుంచి బయటకు వచ్చారు. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరినప్పటికీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి వస్తుందని ఆశ పడ్డారు. కానీ… ఐదేళ్లు ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. ఈ మధ్యలో బాహుబలి ప్రభాస్ ను వెంట పెట్టుకుని ఒకటి రెండు సార్లు ప్రధానిని కూడా కలిశారు. అయినా ఇప్పటికీ.. గుడ్ న్యూస్ వినిపిచలేదు.
ఇప్పుడు… ఏపీ బీజేపీ నేతలందరూ… పోటీకి దూరమని చెబుతూండటంతో.. తన సిన్సియార్టీని నిరూపించుకోవాలని ఆయన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. మీడియా ముందు… ప్రయత్నించినట్లు ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలవకపోయినా… పార్టీ కోసం పోటీ చేశారన్న సింపతీ మోడీ చూపిస్తారని.. రెండో సారి.. ప్రధాని అయితే.. ఆ గవర్నర్ పదవి ఏదో ఇస్తారని ఆశ పడుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు బీజేపీలోనే వ్యక్తమవుతున్నాయి. మరి కృష్ణంరాజు ఆసక్తిని బీజేపీ అంగీకరిస్తుందా..? 70 ఏళ్ల వయసు నిబంధన ఉందని పక్కన పెడుతుందా..? అన్నది వేచి చూడాలి.