హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 20 నాటికి ముగియబోతోంది. కొత్త అధ్యక్షుడు అదే రోజున పదవీబాధ్యతలు స్వీకరిస్తారు. ఆ కొత్త అధ్యక్షుడి కోసం అధునాతన ‘బీస్ట్’ శరవేగంగా రూపొందుతోంది. అమెరికా అధ్యక్షుడు వాడే అధికారిక బాంబ్ ప్రూఫ్ కారునే బీస్ట్ అంటారు. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త బీస్ట్‌పై ప్రస్తుతం రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం బయటకొచ్చింది. ఆ వాహనం ప్రొటోటైప్ స్పైషాట్‌లను ‘ఆటోబ్లాగ్’ అనే వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ స్పైషాట్స్ ప్రస్తుతం నెట్‌లో రౌండ్స్ కొడుతున్నాయి. ఆ కారు ప్రస్తుతం ఒబామా వాడుతున్న వాహనం సైజ్, షేప్‌లోనే ఉన్నప్పటికీ, గ్రిల్, హెడ్ లైట్ డిజైన్ మాత్రం మార్చినట్లు స్పై షాట్‌లలో కనబడుతోంది.
ఈ కారు టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను దేశ రహస్యాలలో ఒకటిగా పరిగణిస్తారు కాబట్టి ఇవి బయటకు తెలియవు. అయితే దీని తయారీకి సంబంధించిన తాజాగా మూడు కాంట్రాక్టులను గతంలో తయారుచేసిన జనరల్ మోటార్స్‌కే ఇచ్చినట్లు ప్రభుత్వ రికార్డులను బట్టి తెలుస్తోంది. లారీ ఛాసిస్‌పైన ఈ కారును నిర్మిస్తారు. యుద్ధ ట్యాంక్‌ల స్థాయిలో దీనిని పటిష్ఠంగా రూపొందిస్తారు. చూడటానికి క్యాడిలాక్ కారులాగా కనిపిస్తుంది. దీని వ్యయం 1 – 1.5 మిలియన్ డాలర్లు(రు.6.78-10.18 కోట్లు) ఉంటుందని ఒక అంచనా. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఒకేసారి ఇలాంటివి 12 కార్లను తయారు చేస్తుంది. వాషింగ్టన్ డీసీలో కొన్నింటిని ఉంచి, కొన్నింటిని ప్రపంచవ్యాప్తంగా అధ్యక్షుడు పర్యటించే సమయాలలో ఆయా ప్రాంతాలకు తరలిస్తారు.