జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఐదు జిల్లాల్లో మాత్రమే పోరాటయాత్ర చేశారు. సమయం లేదన్న కారణంగా.. మిగతా జిల్లాల్లో పోరాటయాత్రలు ఉండవని చెప్పారు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఐదారేళ్ల కిందట పార్టీ పెట్టి.. ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలకు సమయం లేదని చెప్పడం ఏమిటన్న ప్రశ్న రావడమే దానికి కారణం. అయితే.. సమయం లేకపోవడం కాదని.. మాస్టర్ ప్లాన్లో భాగంగానే ఐదు జిల్లాలను మాత్రమే పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారని.. అందుకే.. ఆ ఐదు జిల్లాల్లో మాత్రమే… పోరాటయాత్ర చేసి… మిగతా జిల్లాలను లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.
టీడీపీని ఓడించడమే పవన్ లక్ష్యమా..?
నాలుగో ఆవిర్భావ దినోత్సవం రోజును.. ఒక్క సారిగా.. పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. అప్పటివరకూ.. చంద్రబాబును, ప్రభుత్వాన్ని పొగుడుతూ వచ్చిన పవన్ కల్యాణ్.. ఒక్క సారిగా.. విమర్శించడం ప్రారంభించారు. దాంతో తెర వెనుక ఏం జరిగిందనే ప్రశ్న ఉత్పన్నమయింది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ద్వారా.. రాజకీయ ఒప్పందం కుదిరిందని.. దాని ప్రకారమే… బీజేపీ, వైసీపీతో కలిసి.. ఆయన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారన్న చెప్పుకున్నారు. నిజమో కాదో కానీ.. అసలేం జరుగుతుందో మాత్రం క్లారిటీ లేదు. అనుకున్నట్లుగా ఆయన.. ఉత్తరాంధ్రలో పోరాటయాత్ర చేశారు. అక్కడ వెనుకబాటు తనం అంటూ.. విభజన బీజాలు నాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. రాయలసీమలో బీజేపీ కూడా అదే పని చేసింది. రెండు వైపు.. విభజన బీజాలు నాటే ప్రయత్నాలు జరిగాయి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనుకున్నారు. కానీ ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు.
ఐదు జిల్లాల్లో ఓట్లు చీలిస్తే జగన్ సీఎం అవుతారా..?
ఆ తర్వాత పవన్… ఉభయగోదావరి జిల్లాల్లోనూ పోరాటయాత్ర చేశారు. ఆ సమయంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ … సాయం చేశారని.. ధవళేశ్వరం కవాతు వ్యవహారాలు మొత్తం ఆరెస్సెస్ చూసిందని చెప్పుకున్నారు. పవన్ దీన్ని ఖండించలేదు. ఆ సమయంలో.. తనకు గెలిచే సత్తా లేకపోయినా… ఓడించగలనని చంద్రబాబును సవాల్ చేయడం ప్రారంభించారు. దాని ప్రకారమే.. ఆయన వ్యూహాత్మకంగా… ఇత జిల్లాల జోలికి వెళ్లడం లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అదికారంలోకి రావడానికి కారణం అయిన ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలను టార్గెట్ చేశారు. అక్కడ టీడీపీని దెబ్బతీస్తే… చాలు.. అధికారానికి దూరమవుతుందని భావించారు. దాని ప్రకారమే అదృశ్య శక్యుల నుంచి దిశానిర్దేశం రావడంతోనే.. ఆయన తనకు .. తన సామాజికవర్గానికి అంతో.. ఇంతో పట్టు ఉన్న జిల్లాలు కాబట్టి… టీడీపీని దెబ్బకొట్టడానికి వాటిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు అదే చేస్తున్నారు.
రామ్ మాధవ్ డైరక్షన్లో సినిమా నడుస్తోందా..?
భారతీయ జనతా పార్టీ వ్యూహం కూడా అదే. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీని దెబ్బకొడితే చాలు అధికారానికి దూరమైపోతుదని రామ్ మాధవ్ లాంటి వాళ్లు అంచనా వేశారు. ఆయన వ్యూహం ప్రకారమే.. అంతా నడుస్తోంది. రాయలసీమతో పాటు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో.. టీడీపీ, వైసీపీ హోరాహీరో పోరు జరగాలని… ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో త్రిముఖ పోటీ ఉండాలని.. బీజేపీ కోరుకుంటోంది. అది జరిగితే.. టీడీపీని దెబ్బకొట్టవచ్చని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహం ప్రకారమే.. ఇప్పుడు జనసేనాధినేత అడుగు వేస్తునట్లుగా అర్థం చేసుకోవచ్చు.
— సుభాష్