సంక్రాంతి పండక్కి తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తానని చెప్పి మరీ నవ్వించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’… హ్యాట్రిక్ హిట్స్ తరవాత ‘ఎఫ్ 2’తో నాలుగో హిట్ అందుకుని, సెకండ్ హ్యాట్రిక్‌కి రెడీ అయ్యాడు. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన సినిమా ‘ఎఫ్ 2’. శనివారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ….
– సంక్రాంతి విన్నర్ ‘ఎఫ్2’ అంటుంటే ఎలా ఉంది?
ఏమో…. నేను అంత డీప్‌గా వెళ్ళలేదు. సంక్రాంతి విన్నర్ అంటే పక్క సినిమాలతో పోలుస్తున్నారేమో అన్న ఫీలింగ్ లేదు. ఆ రోజుల్లో జంధ్యాల, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలకు వెళితే.. ప్రతి పంచ్‌కి థియేటర్లో పైనుంచి కిందవరకూ అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడి నవ్వేవారు. వాళ్ళ సినిమాలకు నేను అభిమానిని. ఎప్పటి నుంచో అటువంటి సినిమా తీయాలని కోరిక. ఈ సినిమాతో అది సాధించానని భావిస్తున్నా.
– సోషల్ మీడియాలో కొందరు మిమ్మల్ని ఈతరం జంధ్యాల, ఈవీవీ అంటున్నారు! మీరు ఏమంటారు?
అంత గొప్ప దర్శకులతో పోల్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, నేను వాళ్ళ స్థాయికి వెళ్ళానని అనుకోవడం లేదు. వాళ్ళ సినిమాల నుంచి నేను స్ఫూర్తి పొందాననే మాట మాత్రం వాస్తవం. ఆయా దర్శకులు సినిమాలు ఎక్కువ చూడటంతో వాళ్ళ ప్రభావం నాపై ఉంటుంది. వాళ్ళు తీసినట్టు నేను తీయకున్నా… నా స్టైల్లో నేను సినిమాలు తీస్తున్నా.
– వెంకటేశ్‌తో ‘వెంకీ ఆసన్’ వేయించాలనే ఐడియా ఎవరిది?
అందరి ఇళ్ళల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఏదన్నా చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అని ఆలోచించా. అన్నిటికీ యోగాసనాలు ఉన్నప్పుడు ఫ్రస్ట్రేషన్‌కి కూడా ఒక ఆసనం ఉంటే బావుంటుందనే ఆలోచనలోంచి వచ్చింది. అలాగే, కథకి లింక్ అయ్యేలా వెంకటేశ్ గారికి ఏదైనా టిపికల్ మేనరిజం పెట్టాలనుకున్నా. ప్రేక్షకులు థియేటర్లలో ‘వెంకీ ఆసన్’ వేస్తుంటే సంతోషంగా ఉంది.
– వరుణ్‌తేజ్‌తో కామెడీ బాగా చేయించారు!
వెంకటేశ్‌గారి పక్కన వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అనుకున్నాం. ఇంతవరకూ వరుణ్ కామెడీ చేయకున్నా చాలా బాగా చేశాడు. వెంకటేశ్‌గారితో తను చేసిన ప్రతి సన్నివేశం బావుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భలే కుదిరింది.
– వెంకటేశ్ చేతిలో ‘ముదురు బెండకాయ్’ పెట్టి సెటైర్స్ వేశారు.
అది వెంకటేశ్‌గారి ఐడియానే. ‘అనిల్… ఎక్కడోచోట నా వయసు చెప్పే సెటైర్స్ రాయి’ అని ఆయనే నాతో చెప్పారు. వెంకటేశ్‌గారు ఎంత జెన్యూన్ అంటే ప్రేక్షకులు ఆయన్ను ఆదరిస్తున్నారని అలుసుగా తీసుకోరు. అక్కడక్కాడ అటువంటి డైలాగులు రాయమన్నారు. నేను వద్దుసార్ అంటుంటే ఆయన ఫర్వాలేదనేవారు.
– మల్టీస్టారర్ చేయడం కష్టమేనా? సులభమేనా?
నటీనటులందరూ ఈ కథను నమ్మారు. ‘నాది ఎక్కువ? నాది తక్కువ?’ అని గానీ… ‘ఆయనకు ఎక్కువ డైలాగులున్నాయి. నాకు తక్కువ డైలాగులున్నాయి’ అని గానీ ఎవరూ కంప్లయింట్ చేయలేదు. ఆ తలనొప్పులు నాకు లేవు. వరుణ్‌తేజ్ డైలాగ్ పేపర్ చూసిన తరవాత ‘నాకు ఎన్ని డైలాగులున్నాయి? నాకు తక్కువ డైలాగులున్నాయి’ అని ఏ రోజూ అడగలేదు. అతడిలో గొప్ప విషయమిది. హీరోయిన్లు కూడా అలాగే కథను నమ్మి చేశారు.
– ఈ కథకు పునాది ఎక్కడ పడింది?
‘రాజా ది గ్రేట్’ చేసేటప్పుడు… ‘కమర్షియల్ అంశాలతో కూడిన మూడు యాక్షన్ సినిమాలు చేశా. ఫైట్ లేకుండా ఒక సినిమా చేద్దాం. కంప్లీట్‌గా ఒక ఎంటర్టైనర్ చేద్దాం’ అనుకున్నా. దానికి ఎలాంటి బేస్ తీసుకుందామని అనుకున్నప్పుడు.. ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’, ‘పెళ్ళాం చెబితే వినాలి’ జానర్ సినిమాలు నాకు బాగా ఇష్టం. అవి గుర్తొచ్చాయి. అప్పుడు కుటుంబ నేపథ్యంలో కథ రాసుకున్నా.
– పెళ్ళి తర్వాత రాసిన కథేనా? సినిమా చూసి మీ వైఫ్ ఏమన్నారు?
పెళ్ళి తర్వాత కాబట్టే రాయగలిగా. సినిమాలో ఎన్ని అనుభవాలు రాశానో చూశారా! నా వైఫ్ ఏమంటుందోనని ముందు భయపడ్డా. తను చాలా హ్యాపీగా ఉంది. స్పోర్టివ్‌గా తీసుకుంది. అసలు ఇబ్బంది ఏం లేదు. చివర్లో భార్యలను పొగిడాను కదా. లేకపోతే అంతే.
– ‘అనిల్‌లో ఏదో మేజిక్ ఉంది. సగం స్ర్కిప్ట్‌తో సినిమాకు వెళ్ళాడు’ అని దిల్‌రాజు అన్నారు. బౌండ్ స్ర్కిప్ట్ లేకుండా షూటింగ్‌కి వెళ్ళారా?
ఆయన ఏదో సరదాగా అన్నారు. నేను ప్రతి సినిమాకు బౌండ్ స్ర్కిప్ట్‌తో వెళతా. లేకపోతే ఏం తీయాలోనని కన్ఫ్యూజ్ అవుతా. షూటింగ్‌కి ప్రారంభించడానికి ముందు రాసిన 70 సన్నివేశాలే సినిమాలో ఉంటాయి. ఏం మారవు. సన్నివేశం తీయడంతో కొంత మారుతుంది. అయితే, స్పాట్లో డైలాగులకు, సన్నివేశాలకు మెరుగులు దిద్దుతా. మేజిక్ నాలో లేదు. ప్రేక్షకుల్లో ఉంది. నేను చేసే ప్రతి సినిమాకు వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు.
– సినిమాకు కాంప్లిమెంట్స్‌తో పాటు కథ, పాటలో హీరోయిన్ల డ్రస్సుల విషయంలో క్రిటిసిజమ్ కూడా వచ్చింది. దానిపై మీ కామెంట్?
సినిమా ఫస్టాఫ్‌లో బాగా నవ్వించాను. సెకండాఫ్‌లో కథ చెప్పాలి. అప్పుడు కొంచెం కామెడీ తగ్గింది. అయితే.. కథ చెప్పబట్టే నాజర్ సన్నివేశం బావుందని అందరూ చెబుతున్నారు. భార్యాభర్తల ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యారు. హీరోయిన్ల డ్రస్సుల విషయం అంటారా? నేను కావాలనే చేశా. ఎందుకో తెలుసా? మూడు సినిమాల తరవాత చాలామంది ఫోన్ చేసి ‘ఏవయ్యా… మీ సినిమాలో గ్లామర్ ఉండదేంటి? హీరోయిన్లను మీరు ఏం చూపించడం లేదేంటి?’ అని తిట్టారు. అటువంటి ప్రేక్షకులున్నారని అర్థం చేసుకుని కొంచెం గ్లామర్‌గా చూపించా. అలాగని, బోర్డర్ దాటలేదు. ఫ్యామిలీలు చూసేలా తీశా. రాఘవేంద్రరావుగారు.. మహానుభావులు తీసినట్టు ఒక పాట తీద్దామని ‘గిర్రా గిర్రా’ తీశా. ఆ మసలా ఉండాలిగా!
– ‘ఎఫ్ 2’ సీక్వెల్ ఉంటుందని విన్నాం!
నేను చేద్దామనుకుంటున్నా. హిందీలో ‘గోల్మాల్’, ‘హౌస్‌ఫుల్’ సిరీస్ ట్రెండ్ ఉంది. తెలుగులో ఇటువంటి జానర్లో అలా చేయాలనుంది. తప్పకుండా ‘ఎఫ్ 2’ సీక్వెల్ చేస్తా. వెంకటేశ్‌గారికి, వరుణ్‌తేజ్‌కి కూడా చెప్పేశా. వాళ్ళు ‘ఏనీ టైమ్. మేం రెడీ’ అన్నారు. ‘ఎఫ్ 3’ తప్పకుండా ఉంటుంది.
– ‘ఎఫ్ 3’ అంటే ముగ్గురు ఉంటారా?
ఏమో? ఇప్పుడే చెప్పలేను.
– వెంకటేశ్‌కి సోలో హీరో సబ్జెక్ట్ చెప్పారట!
ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చింది. కథ రాయాలి. వెంటనే ఆ సినిమా ఉంటుందా? లేదా తర్వాతా? అనేది ఇప్పుడే చెప్పలేను.