హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు మీడియాతో మాట్లాడతానని జనసేన కార్యాలయంనుంచి సమాచారం అందింది. ఓటుకు నోటు దానికి సంబంధించిన ఇతర అంశాలపై పవన్ ఎట్టకేలకు నోరు విప్పబోతున్నారు. పాలకులను ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్, రెండు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై మౌనంగా ఉండటమేమిటంటూ పలువురు నేతలు తీవ్రంగా ప్రశ్నించారు. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మనుంచి మొదలుపెట్టి వి.హనుమంతరావువంటి తలపండిన రాజకీయనాయకుడు వరకు చాలామంది పవన్ మౌనాన్ని తప్పుబట్టారు. వీహెచ్ అయితే పవన్ స్పందించకపోతే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తాననికూడా హెచ్చరించారు. ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాలపై తన అభిప్రాయాలను రెండు, మూడు రోజులలో చెబుతానని పవన్ గత నెల 29న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజులన్నది వారంరోజులకు చేరి ఏదైతేనేం ఎట్టకేలకు తన అభిప్రాయాలను వ్యక్తం చేయబోతున్నారు పవర్ స్టార్. తెగేదాకా లాగొద్దంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ సూచనలు చేసిన పవన్ ఈరోజు ఏమి చెబుతారోనని ఉత్కంఠగా ఉంది.