తెలంగాణ రాష్ట్ర సమితితో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి..ఇటీవలి కాలంలో అనుబంధం విపరీతంగా పెరిగిందనేది అందరికీ తెలిసిన విషయం. స్వయంగా జగన్మోహన్ రెడ్డినే టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో ప్రత్యేకంగా చెప్పుకున్నారు కూడా. అంత అనుబంధాన్ని జగన్ పెంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మహాకూటమిని ఓడించారు. చంద్రబాబును విమర్శించారు. ఆ కారణంగానే… కేసీఆర్ పై.. జగన్ హీరోయిక్ ఫీలింగ్ కలుగుతోంది. కేసీఆర్ ను ఓ హీరోలా భావిస్తున్నారు. అంతకు ముందు జగన్.. తెలంగాణలో అడుగు పెడతానంటే.. అదే కేసీఆర్… అదే టీఆర్ఎస్…. ఎలా అడ్డుకుందో.. మానుకోటలో కథలు కథలుగా చెబుతారు. ఆ దెబ్బకు జగన్ వెనక్కి వచ్చేశారు…కూడా. బహుశా అది జగన్ కు గుర్తు ఉండదేమో కానీ… వీరి అనుబంధాన్ని ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఓ ప్రత్యేక శైలితో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కొద్ది రోజుల కిందట… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని వారు .. టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న విషయాన్ని బయటపెట్టి ఓ రకమైన సంచలనాన్నే నమోదు చేశారు. ఈ వ్యవహారం… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపింది. ఏపీలో మహాకూటమిని ఏర్పాటు చేయించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉన్నట్లు పవన్ ప్రకటన ద్వారా తేలింది. ఇప్పుడీ ఆరోపణలను పవన్ కల్యాణ్ మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ తో … వైసీపీ అధినేత జగన్ కు అంత అనుబంధం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. గతంలో..జగన్ తో… టీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో గుర్తు లేదా అంటూ.. విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్, వైసీపీని కలిపి పవన్ కల్యాణ్ చేసిన ఈ విమర్శలు… మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటి వరకూ… టీఆర్ఎస్, వైసీపీల మధ్య లోపాయికారీ వ్యవహారాలే ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం… ప్రత్యక్ష సంబంధాలు రెండు పార్టీల మధ్య ఉన్నయని చెప్పేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కొక్క విమర్శ ద్వారా నేరుగా ప్రజల మనసుల్లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రత్యేకమైన వ్యూహంతోనే.. ప్రజల్లో.. టీఆర్ఎస్ కు బలమైన మద్దతుదారు.. వైసీపీ అనే భావాన్ని తీసుకెళ్లడానికే వరుసగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రమేయాన్ని ఏపీ ప్రజలు ఏ మాత్రం అంగీకరించరు. వైసీపీపై. .. బలంగా టీఆర్ఎస్ సపోర్టర్ అనే ముద్ర పడితే.. కచ్చితంగా అది జగన్ పార్టీకి మైనస్ అవుతుంది. అదే సమయంలో.. పవన్ సపోర్టర్ కాదా.. అంటే.. ఇప్పటి వరకూ అవుననే సమాధానమే వస్తుంది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ ను ఆయన ప్రత్యక్షంగా అభినందించారు. అందుకే ప్రజల్లో కూడా… వైసీపీతో పాటు జనసేన కూడా టీఆర్ఎస్ కు అనుబంధమే అన్న క్లారిటీ ప్రజలకు ఉంది. ఇప్పుడు.. కేవలం.. టీఆర్ఎస్ తో వైసీపీకి ముడిపెట్టి విమర్శలు చేయడం వల్ల.. తన పార్టీపై టీఆర్ఎస్ నీడ పడకుండా.. పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకోవవచ్చు. ఇదే నిజం అయితే.. ముందు ముందు.. జగన్, టీఆర్ఎస్ లింకులపై.. పవన్ కల్యాణ్ మరిన్ని విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.