ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని పదేపదే చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఇంతగా రాజకీయ శత్రుత్వం కేసీఆర్ కి ఎందుకు అనేది స్పష్టంగానే కనిపిస్తోంది. ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్లాలి. ఢిల్లీలో ఆయనకి ప్రాధాన్యత పెరగాలంటే… ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు అక్కడి వరకూ రాకూడదు! కాబట్టి, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని ఓడించాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జోక్యం చేసుకుంది కాబట్టి, దానికి బదులు రిటర్న్ గిఫ్ట్ అని అంటున్నారుగానీ… కేసీఆర్ అసలు ఆందోళన ఢిల్లీ రాజకీయ ఆశలపై అనేది అర్థమౌతూనే ఉంది.
కారణం ఏదైనా, లక్ష్యాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ దాదాపు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఏపీలో వాస్తవ రాజకీయ పరిస్థితిపై ఓ సర్వే చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటుగా… టీడీపీని ఓడించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించే ప్రయత్నాలు కూడా కేసీఆర్ తెర వెనక మొదలుపెట్టారనే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. తెలంగాణలో పెద్దపెద్ద కాంట్రాక్టులు చేస్తున్న దాదాపు ఓ పదిమంది వ్యాపారవేత్తలతో నిధుల సమీకరణ జరగబోతుందనీ, దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ డీల్ ఏంటంటే… ‘ఆంధ్రాలో వైకాపా తరఫున పెట్టుబడులు పెడితే, అక్కడ జగన్ అధికారంలోకి వస్తే, అక్కడ కూడా పెద్ద కాంట్రాక్టులు చేసుకునే అవకాశం వారికే వస్తుంది. అక్కడి ప్రభుత్వం ఈ పెట్టుబడిదారులకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది’ అనేది..! ఇలాంటి డీల్స్ కుదిర్చే పని తెరాస తలకెత్తుకుంది అనే కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఆంధ్రా రాజకీయాల్లో తెరాస జోక్యం చేసుకోవడాన్ని ఎవ్వరూ అభ్యంతరకరం అనరు. కాకపోతే, ఏ ప్రాతిపదికన వారీ ప్రయత్నాలు చేస్తున్నారు అనేదే వారు వివరించాలి. ఎమ్మెల్యేలుగా తెరాస అభ్యర్థుల్ని ఆంధ్రాలో పోటీలోకి దింపుతారా..? ఆంధ్రా ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ తెరాస నేతలు ప్రచారం చేసుకోగలరా..? ఫలానా పార్టీకి తాము మద్దతు ఇస్తున్నది… ప్రజల ప్రయోజనాల కోసమే అని చెప్పగలరా..? అంతెందుకు, ఏపీ ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తామనీ తెస్తామనీ చెప్పగలరా..? తెర ముందైనా తెర వెనకైనా ఏ అజెండాతో ఆంధ్రాలో రాజకీయం చేయాలని తెరాస భావిస్తోంది..?
కేవలం కేసీఆర్ వ్యక్తిగత రాజకీయ లక్ష్యాల సాధన, కక్ష సాధింపు ధోరణి… ఇవి మాత్రమే ఏపీలో తెరాస జోక్యం వెనక ఉన్న సిద్ధాంతాలు. అంతకుమించి ప్రజలకు మేలు చేసే ఏ చిన్నపాటి అంశమూ వారు వేలు పెట్టడం వెనక లేదన్నది ముమ్మాటికీ నిజం. అది తెలిసి కూడా వారి మద్దతు కోసం పాకులాడే పార్టీలు… ఏపీ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయనీ, అభివ్రుద్ధికి కట్టుబడి ఉంటాయంటే ఎవరైనా నమ్ముతారా..?