విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసును జాతీయ భద్రతా సంస్థ.. ఎన్ఐఏకు అప్పగించారు. దీనిపై.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని లేఖలు కూడా రాశారు. అందుకే… ఈ వివాదం ఇప్పుడు పెద్దది అవుతోంది. ఇప్పుడు.. ఎన్ ఐ ఏ .. కోడికత్తి కేసును విచారించాలా లేదా… ఎన్ఐఏకు ఆ అధికారం ఉందా లేదా అన్నది కీలకం.
జగన్ కు ఏపీ పోలీసులపై ఎందుకు నమ్మకం ఉండటం లేదు..?
విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన తర్వాత…. ఆ కేసును ఎవరు విచారించాలన్నది కీలకంగా మారింది. ఎందుకంటే.. తమకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని… వైసీపీ నేతలు చెబుతున్నారు. దానికి వారు చెబుతున్న కారణం.. దాడి జరిగిన గంటలోపే…. ఆ దాడి చేసింది.. వైఎస్ జగన్ అభిమాని అని… జగన్ కు లాభం చేయడానికే హోంమంత్రితో పాటు… ఏపీ డీజీపీ కూడా ప్రకటించారు. ఈ కారణంగా దర్యాప్తు జరపకుండానే… ఇలా ప్రకటించడాన్ని.. వైసీపీ ఆక్షేపిస్తోంది. ఏపీ డీజీపీ అలా ప్రకటించడం వల్ల… వైసీపీకి నమ్మకం లేదని చెప్పుడంలో అర్థం ఉంది. పోలీసు చీఫ్ అలా చెప్పిన తర్వాత ఇక విచారణ చేయాల్సింది ఏముంది..? అందువల్ల… ఏపీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటపడతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అదే వాదనను వైసీపీ వినిపిస్తోంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఎన్ఐఏపై చంద్రబాబుకు ఎందుకు అనుమానం…?
అలాగే…వైసీపీకి నమ్మకం లేనప్పుడు.. ఇంకెవరు.. దర్యాప్తు చేయాలి. వైసీపీకి కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం ఉంది. సీబీఐ మీద.. ఎన్ఐఏ మీద కూడా ఉంది. వారికి అంత నమ్మకం ఎలా వచ్చిందో తెలియదు. కానీ అదే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిచుకుని… బీజేపీ.. ఎంతగా రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. పైగా.. మోడీ కి చంద్రబాబు మధ్య వార్ జరుగుతున్న సమయంలో… కేంద్ర దర్యాప్తు సంస్థలు… విచారణ నిష్పాక్షికంగా జరుపుతాయన్న నమ్మకం టీడీపీ నేతలు ఉండాల్సిన అవసరం లేదు. మోడీ ప్రతి రోజు చంద్రబాబును విమర్శిస్తున్నారు. అదే సమయంలో.. చాలా రోజులుగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ చూసిన చూసిన చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే… ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించారనే అనుమానం కలగడం సహజం.
ఇద్దరికీ నమ్మకం కలిగేలా ఎవరు దర్యాప్తు చేయాలి..?
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపితే జగన్ కు నమ్మకం ఉండదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితే .. ఏపీ ప్రభుత్వానికి నమ్మకం ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి..? ఈ సమస్యకు పరిష్కారం… కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు.. పూర్తిగా కోర్టు పరిధిలో జరగాలి. ఎవరు దర్యాప్తు జరిపినప్పటికి.. హైకోర్టు ఈ కేసును పర్యవేక్షించాలి. అవసరం అయితే.. కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల్లోని సీనియర్ అధికారులతో కోర్టే ఓ టీమ్ ను ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసిన టీమ్ దర్యాప్తును కోర్టు పర్యవేక్షించాలి. అప్పుడు మాత్రమే.. బయటపడే నిజాలపై అందరికీ నమ్మకం కలిగే అవకాశం ఉంది.