పవన్ కళ్యాణ్ కి జగన్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈరోజు టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ జగన్ పై పలు విమర్శలు చేశారు. జగన్ తో పొత్తు పెట్టుకో కూడదు అని తాను ఎందుకు అనుకుంటున్నాడు వంటి విషయాల మీద వివరణ ఇచ్చిన పవన్ కళ్యాణ్, జగన్ గతంలో తన మీద చేసిన విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చాడు.
జగన్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్, జగన్ మీద ఉన్న అవినీతి కేసుల కారణంగానే అతనితో పొత్తుకు తాను వ్యతిరేకం గా ఉన్నా అని వ్యాఖ్యానించాడు. ముందు తన మీద ఉన్న కేసులన్నింటి నుంచి జగన్ నిర్దోషిగా బయటపడితే అప్పుడు జగన్తో పొత్తు గురించి ఆలోచిస్తా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అయితే, జగన్ మీద ఉన్న అవినీతి మొత్తం కేవలం ఆరోపణలు మాత్రమే అని, ఒక్కటి కూడా ఇప్పటివరకు నిరూపితం కాలేదు కదా అని రిపోర్టర్ ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఒక మనిషి ఇంత స్వల్ప వ్యవధిలో అంత ఆదాయం సంపాదించాలి అంటే తనతో పాటు తన కింద ఉన్న ఎంతోమంది కూడా ఉపాధి కల్పించి ఉండాలి అని, అలా జరగలేదు అంటే దానర్థం అది అవినీతి సొమ్ము అని పవన్ కళ్యాణ్ వివరించాడు. తాము సినిమాల లో కొన్ని కోట్లు సంపాదించే ది వాస్తవమే అయినప్పటికీ, తమ సినిమాల ద్వారా మరింత మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తుందని, అలాగే, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ తెస్తున్నాయి అంటే, ఆ సంస్థల ద్వారా కూడా మరెంతో మందికి ఉపాధి లభిస్తుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే జగన్ విషయానికి వచ్చేసరికి కేవలం తాను మాత్రమే లాభపడ్డారని, తన ఆదాయం మాత్రమే పెరిగిందని, దీన్ని బట్టి చూస్తే ఎక్కడి అవినీతి సొమ్మునో తీసుకువచ్చి తమ ఆదాయం పెంచుకున్నట్టు అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే జగన్తో పొత్తుకు తాము సిద్ధంగా లేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
గతంలో జగన్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ, ” పవన్ కళ్యాణ్ కి సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ” అని వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రిపోర్టర్ గుర్తు చేయగా, పవన్ కళ్యాణ్ జగన్ మీద కౌంటర్ వేశారు. “వారానికోసారి ప్రతి శుక్రవారం ఇంటర్వెల్ తీసుకునేది ఎవరో ప్రజలందరికీ తెలుసు ” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.
మొత్తానికి, పవన్ కళ్యాణ్ జగన్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.