కర్ణాటకలో మరో సారి రాజకీయంగా అస్థిరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్వల్ప మెజార్టీతో.. ప్రభుత్వాన్ని నడుపుతున్న కుమారస్వామికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. వారిద్దరూ.. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్స్ గెలిచిన వీరు… ఆ తర్వాత కాంగ్రెస్ పంచన చేరారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు గవర్నర్ కు లేఖలు రాశారు. మరో వైపు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందర్నీ ఆ పార్టీ అగ్రనాయకత్వం.. హర్యానాలోని రిసార్ట్ కు తరలించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వారిలో ఉన్నారన్న ప్రచారం ప్రారంభమయింది. . మరో పది మందితో చర్చలు పూర్తయ్యాయని… వారు ఓకే అన్న మరుక్షణం అందరితో.. కలిసి ఆపరేషన్ కమల్ ప్రారంభించి .. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొడతామని బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
దక్షిణాదిలో బీజేపీ చేతిలో ఒక్క రాష్ట్రం కూడా లేదు. దక్షిణాదిలో సీట్లు పెరిగితేనే బీజేపీకి అధికారం నిలబడుతంది. అందుకే ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని మార్చాలన్న లక్ష్యంతో.. అమిత్ షా ఉన్నట్లు కర్ణాటక బీజేపీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం … ఏ మాత్రం సాఫీగా సాగడం లేదన్నది మాత్రం నిజం. కాంగ్రెస్ లో … మంత్రి పదవులు ఆశించిన వారు…. ఎక్కువ మంది ఉన్నారు. పదవులు రాక అనేక మందికి అసంతృప్తికి గురయ్యారు. వారందరిపై… బీజేపీ కన్నేసింది. కొంత మంది ఇప్పటికే.. బహిరంగంగానే… కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కర్ణాటకలో బీజేపీ ఒక సారి అధికారంలోకి వచ్చింది. అప్పట్లోనూ మైనార్టీ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను … ఆకర్షించి వారితో రాజీనామా చేయించి.. మళ్లీ అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారు. దానికి ఆపరేషన్ కమల్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ఆపరేషన్ కమల్ అమలు చేస్తున్నారంటున్నారు.
గత ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పెద్దగా మెజార్టీ రాలేదు. 224 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 104 సీట్లను గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచిది. మెజార్టీకి తొమ్మిది ఎమ్మెల్యే సీట్ల దూరంలో ఉండిపోయింది. కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37 స్థానాలు రావడంతో.. రెండు పార్టీలు.. కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్ కే అప్పగించింది కాంగ్రెస్. అయితే.. అతి పెద్ద పార్టీగా.. బీజేపీ ముందుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు చేసి.. భంగపడింది. తప్పని పరిస్థితుల్లో యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పలేదు. పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. బలపరీక్ష జరిగితే ఓడిపోతుంది. అదే జరిగితే.. కర్ణాటక ఎన్నికలను మళ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటే నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఎవరికీ అర్థం కావడం లేదు.