తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకునే రాజకీయ నిర్ణయాలను వైసీపీ అధినేత జగన్ … చాలా విచిత్రమైన భాషతో అవహేళన చేస్తూ ఉంటారు. అందులో ఒకటి సినిమా .. రెండోది పెళ్లి. ఈ రెండింటితోనూ పోలుస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు… గత మూడు దశాబ్దాల కాలంలో ఏఏ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారో చెబుతూ… అన్ని పార్టీలనూ పెళ్లి చేసుకున్నారని… ఇప్పుడు… కాంగ్రెస్ తో ఆ పని చేస్తున్నారని చెప్పుకొస్తారు. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. తన వైసీపీతో ఆ పని చేయించబోతున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ తో పెళ్లి చేయబోతున్నారు. ఈ ఫ్రంట్ కు పెళ్లికొడుకెవరనేది అందరికీ తెలిసిందే కానీ… బహిరంగ రహస్యం లాంటిది. ఎవరికీ చెప్పరు.. ఎవరైనా చెప్పినా.. అంగీకరించరు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్లో వైసీపీ చేరడం అనేది చాలా కాలంగా.. జరుగుతున్న ప్లాన్ లో భాగమే. బీజేపీతో నేరుగా కలవలేక.. లోపాయికారీగా మద్దతిస్తున్న పార్టీల కోసమే.. ఈ ఫెడరల్ ఫ్రంట్ రూపుదిద్దుకుందన్న అభిప్రాయాలున్నాయి. దానికి కొన్ని పక్కా సాక్ష్యాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు.. జగన్ మద్దతు పలకడమే కాదు.. ఆ తర్వాత ఓ పద్దతి ప్రకారం.. కేసీర్ కూటమితో కలిపేందుకు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీని కోసమే కేసీఆర్ ప్రత్యేకహోదా కోసం ప్రధానికి లేఖ రాస్తానన్న ప్రకటన చేశారు. ఈ ప్రకటన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా.. జగన్ ఆమోద ముద్ర వేశారు. కేసీఆర్ ఏదో ఏపీ కోసం… ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లోక్ సభ సీట్లు లెక్కలను.. చూపి.. వరుసలు కలిపేశారు. ఇప్పుడు నేరుగా చర్చలకు దిగారు. అంటే.. ముందుగానే మ్యాచ్ ఫిక్స్ చేసుకుని… మిగతా వ్యవహారాల్ని నడిపారన్నమాట.
అంటే… టీఆర్ఎస్ తో జట్టు కట్టి… అంతిమంగా బీజేపీ పంచకు చేరాలన్న ఆలోచనను.. జగన్, కేసీఆర్ చాలా పకడ్బందీగానే అమలు చేస్తున్నారన్న విషయం స్పష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజల్ని నిత్యం దూషిస్తూ… ఏపీ మీద ద్వేషాన్నే… పెట్టుబడిగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ తో… జగన్ కలసి నడవడం.. ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారనుంది. మొత్తానికి.. వైసీపీ .. ఓ కూటమిలో భాగస్వామి అవుతోంది. ఆ కూటమిలో… టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఉండొచ్చు… అయినప్పటికీ.. కూటమి అనేది ఒకటి ఉంటుది.. ఆందులో వైసీపీ ఉంటుంది. అంటే ఫెడరల్ ఫ్రంట్ తో … వైసీపీ పెళ్లి అయిపోయిందన్నమాట.