విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తి దాడి కేసును ఇప్పుడు ఎన్.ఐ.ఎ. దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ ను ఎన్.ఐ.ఎ. అధికారులే విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్.ఐ.ఎన్. ఆఫీస్ లో శ్రీనివాస్ ను ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకూ జరిగిన విచారణలో… అవే పాత విషయాలను మళ్లీ మళ్లీ చెబుతున్నాడట. జగన్ పై దాడి వ్యవహారంలో తన వెనక ఎవ్వరూ లేరని పదేపదే చెబుతున్నట్టు సమాచారం. అయితే, దాడికి పాల్పడ్డ ముందు కొంతమందితో శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించారు. ఇప్పుడు వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
తన వెనక ఎవ్వరూ లేరనీ, తన భావాలేంటనేవి ఇంతకుముందే 11 పేజీల లేఖ రాసిచ్చాననీ, మరో 22 పేజీలు వేరే లేఖలో రాశానని శ్రీనివాస్ అంటున్నాడట. మరణించినా ఎలాంటి బాధాలేదనీ, కానీ తాను రాసిన ఆ 22 పేజీల పుస్తకం విడుదల చేయాలంటూ విచారణలో అధికారులను కోరుతున్నాడట. సెంట్రల్ జైలు సిబ్బంది పుస్తకం లాక్కున్నారనీ, ఏదో ఒకటి చేసి దాన్ని విడుదల చేయండీ అంటూ తనను కలిసిన లాయర్ తో శ్రీనివాస్ చెప్పుకున్నాడట. ఎన్.ఐ.ఎ. అధికారులను కూడా శ్రీనివాస్ ఇదే అంశమై పదేపదే అడుగుతున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ విచారణకు మరో మూడు రోజులు గడువు మాత్రమే ఉంది. తాజా విచారణలో ఇప్పటివరకూ కొత్త అంశాలంటూ ఏవీ రాబట్టనట్టే తెలుస్తోంది.
ఎన్.ఐ.ఎ. విచారణ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏదో జరిగిపోతుందన్న ఆర్భాటమే కనిపిస్తోంది. కోర్టు ద్వారా శ్రీనివాస్ ను కస్టడీకి తీసుకుని… అక్కడా ఇక్కడా విచారణ అంటూ చక్కర్లు కొట్టారు. అంతేకాదు, కేసు విచారణకు తీసుకోగానే ముందుగా చెయ్యాల్సింది.. బాధితుడి వాంగ్మూలం నమోదు! కానీ, ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. అయితే, ఇది జగన్ కోరుకున్న విచారణే కాబట్టి, ఇప్పుడు ఆయన సహకరించే అవకాశం ఉంటుంది. కానీ, ఆ దిశగా ఇంకా దర్యాప్తు ప్రారంభమే కాలేదు! నిందితుడు శ్రీనివాస్ చుట్టూనే ఎన్.ఐ.ఎ. అధికారులు తిరుగుతున్నారు. ‘ఈ కేసులో ఎలా దర్యాప్తు జరగాలి’ అనేదానిపై అప్రకటిత వైకాపా దిశా నిర్దేశం ఇప్పటికే చేసేసిన సంగతి తెలిసిందే! ఎవరిని విచారిస్తే వాస్తవాలు బయటకి వస్తాయో సాక్షి పత్రికే చెప్పేసిన పరిస్థితి..! మరి, ఎన్.ఐ.ఎ. దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో చూడాలి.