ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో టి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్ లో బుధవారం ఈ భేటీ జరుగుతుంది. దీనికి తెరాస నుంచి కేటీఆర్, ఎంపీ వినోద్, రాజేశ్వరరెడ్డి వెళ్తున్నారు. ఇంతకీ ఈ మీటింగ్ అజెండా ఏంటంటే… జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నం! వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మూడో ప్రత్యామ్నాయాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు సీఎం కేసీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్లో భాగంగానే ఆంధ్రాలో జగన్ ను కూడా కలుపుకుని ముందుకు సాగేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దాన్లో భాగంగానే ఈ భేటీ జరుగుతుందని తెరాస వర్గాలు అంటున్నాయి.
అయితే, ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెడతా అంటూ కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, తెరాసతో తమకు ఎలాంటి సంబంధం లేదనీ, ఎలాంటి కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదంటూ వైకాపా నేతలు కూడా ఈ మధ్యనే కొట్టిపారేసిన సందర్భాలున్నాయి. ఇందుకు భిన్నంగా భేటీ జరుగుతుండటం కూడా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం కాబోతోంది. ఇది కేవలం జాతీయ రాజకీయ వ్యూహాల్లో భాగంగా జరుగుతున్నదే అని తెరాస ప్రకటిస్తున్నా… ఆంధ్రా రాజకీయాలు దీన్లో చర్చకు వస్తాయనేది వేరే చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో భాగంగా వైకాపాకు తెరాస మద్దతు ఇస్తుందనే అభిప్రాయం ఆంధ్రాలో బలంగా ఏర్పడింది. దాని తగ్గట్టుగానే, అక్కడ పర్యటిస్తున్న తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తాజాగా కొన్ని ప్రకటనలు చేస్తుండటం చూశాం. కాబట్టి, వీటి ప్రస్థావన రాలేదని రేపు మీడియా ముందు జగన్ గానీ, కేటీఆర్ గానీ చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు!
ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా త్వరలోనే జగన్ భేటీ ఉంటుందని తెలుస్తోంది! జాతీయ రాజకీయాలపై చర్చ అనంతరం… కొద్దిరోజుల్లో జగన్ ను ప్రగతి భవన్ కు కేసీఆర్ ఆహ్వానించే అవకాశం ఉందనీ తెరాస వర్గాలు చెబుతున్నాయి. అది కూడా జాతీయ రాజకీయాల ట్యాగ్ లైన్ తోనే జరుగుతుందనీ అంటున్నారు. వాస్తవం మాట్లాడుకుంటే… లోక్ సభ ఎన్నికలు దాటేవరకూ మూడో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఏ ప్రయత్నం చేసినా ఫలితం ఉండదనేది కేసీఆర్ కు ఇటీవలే అనుభవంలోకి వచ్చిన అంశం. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలు కేసీఆర్ ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదు. అఖిలేష్ యాదవ్ కలవలేదు! ఇప్పుడు ఇదే అంశమై జగన్ తో ప్రత్యేకంగా చర్చించడానికి ఏముంటుంది..?