స్టార్ కమెడియన్ బ్రహ్మానందంకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరవై రెండేళ్ల బ్రహ్మానందం… ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించుకున్నారు. ఆదివారం అస్వస్థతగా ఉండటంతో ఆయనను హైదరాబాద్ లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. హుటాహుటిన ముంబైకి తరలించారు. అక్కడ ప్రఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణులు… రమాకాంత్ పాండా బ్రహ్మానందంకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. అబ్జర్వేషన్ ఉంచారని… ఆరోగ్యం కుదటపడగానే.. డిశ్చార్జ్ చేస్తారని చెబుతున్నారు.
దాదాపుగా వెయ్యికిపై సినిమాల్లో నటించిన బ్రహ్మానందం.. తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఆరోగ్యం విషయంలో చాలా నియమంగా ఉంటారని సినిమా పరిశ్రమ వర్గాలు చెబుతూ ఉంటాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు.. మూడు షిప్టుల్లో పని చేసేవారు. ఆ సమయంలో.. కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోయానని.. ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోయానన్న కారణంతో.. ఆయన చాలా కాలం నుంచి ఓ టైమింగ్ ప్రకారమే పని చేస్తున్నారు. సినిమాలు కూడా తగ్గించుకున్నారు.
బ్రహ్మానందం హార్ట్ ఆపరేషన్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్ర పరిశ్రమలోని చాలా మంది వ్యక్తులకు కూడా తెలియదు. అందుకే.. ముంబైలో బ్రాహ్మానందం చికిత్స తీసుకుంటున్నారని తెలియగానే.. ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. చాలా మంది ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. బ్రహ్మానందం కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు.