చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్… విజయవాడ వెళ్లి ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి మరీ చంద్రబాబును విమర్శిస్తానని చాలెంజ్ చేశారు. దాని ప్రకారం… ఇప్పుడు అన్నీ కలసి వచ్చాయి. తేదీ కూడా ఖరారయింది. ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన కొత్త మిత్రుడు… వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి.. ఆయన… విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తదుపరి చర్చలు.. అమరావతిలో జరపాలని నిర్ణయించుకున్న జగన్, కేసీఆర్.. అందుకో సందర్భాన్ని ఎంచుకున్నారు. అమరావతిలో వైఎస్ జగన్ నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఫిబ్రవరి పధ్నాలుగో తేదీన జరగనుంది. ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ హాజరు కానున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయి. తమ ఉమ్మడి ఎజెండా చంద్రబాబు కాబట్టి… ఆ తర్వాత రాజకీయం కూడా అటు వైపే సాగుతుంది.
చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ ప్రకటన జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఆకర్షించింది. కేసీఆర్ తన వ్యూహాలతో.. చంద్రబాబును ఓడించగలరన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో ఏర్పడింది. అందుకే కేసీఆర్ లో ఓ హీరోని చూస్తున్నారన్న భావన ఏర్పడింది. టీఆర్ఎస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయదు కాబట్టి…. చంద్రబాబును ఓడిస్తే లాభపడేది తనే కాబట్టి… ఆ క్రమంలో టీఆర్ఎస్ కు జగన్ బాగా దగ్గరవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్… చంద్రబాబును యాగానికి ఆహ్వానించేందుకు ఓ సారి, విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మరోసారి కేసీఆర్ రెండు సార్లు అమరావతి వచ్చారు. కానీ రాజకీయం కోసం రాలేదు. తొలి సారి రాజకీయం కోసం… అమరావతి రాబోతున్నారు. అయితే ఈ పర్యటనలో వస్తున్న స్పష్టమైన మార్పు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రావడం.
కేసీఆర్ అమరావతి పర్యటన కచ్చితంగా.. రాజకీయాల్ని మలుపు తిప్పే వ్యవహారమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవహారాన్ని మరింతగా రాజకీయం చేయకుండా ఉండదు. ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటో వైసీపీ శ్రేణులకూ అంతుబట్టడం లేదు. టీఆర్ఎస్ అధినేతను భుజాలపై మోయడం వల్ల… ఇప్పటికిప్పుడు.. తమ పార్టీకి వచ్చే లాభమేమిటో వారు అంచనా వేయలేకపోతున్నారు. కానీ జగన్ మాత్రం.. ఎవరి మాటల్ని వినే పరిస్థితులో లేరు.