ఎంపీల సంఖ్యకు సంబంధించి ప్రతిపక్ష నేత జగన్ ఎలా మాట మార్చారు అనేది తెలియాలంటే… దానికంటే ముందు గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు గుర్తుచేసుకోవాలి. పాదయాత్ర చివరి దశలో, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జగన్ ప్రత్యేక హోదా గురించీ, చంద్రబాబు సర్కారు గురించీ కొన్ని విమర్శలు చేశారు. ‘20 మంది ఎంపీలను పక్కనపెట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయలేని నువ్వు రాజకీయాల్లో ఉండటానికి అర్హుడివేనా? వెంటనే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకో’… ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేసిన ఒక కామెంట్. ‘నాకు 25కు 25 ఎంపీలు ఇవ్వండి. ప్రత్యేక హోదా తీసుకొస్తా’ అన్నారు. 25 మంది ఎంపీలను మాకిస్తే, ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఎవరైతే చెబుతారో వారికే మద్దతు ఇచ్చి సాధించుకుందామన్నారు జగన్.
ఇక, నిన్నటి కేటీఆర్ తో భేటీ అనంతరం జగన్ మాట్లాడిన మాటల విషయానికొద్దాం. మనరాష్ట్రంలోని 25 మంది ఎంపీలు లోక్ సభలో డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు జగన్. సంఖ్యాపరంగా చూసుకుంటే ఇది సరిపోదన్నారు. ఈ అన్యాయాన్ని సమర్థంగా ఎదిరించి పోరాటం చెయ్యాలంటే ఈ సంఖ్య సరిపోదన్నారు. మనకున్న పాతిక మందికి తెలంగాణ నుంచి మరో 17 మంది తోడైతే… 42 మంది ఎంపీలు అవుతారనీ, అప్పుడు ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే బాగుంటుందన్నారు. ఇంతమంది కలిసి పార్లమెంటులో నిలదీస్తే రాష్ట్రానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు జగన్.
అంటే… జగన్ పాదయాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తనకే నమ్మకం లేదని తానే ఒప్పుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. 25 మంది ఇస్తే చాలు హోదా సాధించుకొచ్చేస్తామని ఏపీ ప్రజలకు చెప్పి, ఇప్పుడు ఆ నంబర్ చాలదని మాట్లాడటాన్ని ఏమనుకోవాలి..? ఇప్పటికి కూడా, ప్రత్యేక హోదా సాధన ఎలాగో జగన్ కు సరైన విజన్ లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే… ఏపీకి హోదా రావాలంటే పార్లమెంటులో ఇతర పార్టీల మద్దతు కూడా అవసరమౌతుంది. 545 లోక్ సభ సీట్లలో ఏపీ తెలంగాణా కలుపుకున్నా మొత్తం అయ్యేది 42 మాత్రమే. ఏపీ నుంచి ఎంతమంది ఉన్నారూ, తెలంగాణ నుంచి ఎంతమంది తోడౌతున్నారు అనేది ఒక్కటే అక్కడి ప్రాతిపదిక కాదు. దీంతోపాటు జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టాలి. ఆ స్థాయి ప్రయత్నం ఇంతవరకూ చెయ్యలేకపోయారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇతర పార్టీల నుంచి వైకాపా కూడగట్టిన మద్దతు ఏపాటిది..? ఇప్పుడు కేసీఆర్ తో కలుస్తున్న సందర్భాన్ని సమర్థించుకోవడం కోసం ‘హోదా సాధన కోసమే కలిశాం’ అని జగన్ చెప్తున్నారు. హోదా సాధనకు కేవలం 42 ఎంపీలుంటే సరిపోతుందనేది సరైన వాదన కాదు. ఇతర పార్టీలూ తోడవ్వాలి, అందరి మద్దతూ కావాలి.