ఈ సంక్రాంతి విజేతగా నిలిచింది ఎఫ్ 2. ఇటీవల కాలంలో దిల్ రాజు సినిమాకి ఇన్ని భారీ లాభాలు రాలేదు. మిగిలిన సినిమాల టాక్ అంతంత మాత్రంగానే ఉండడం, ఫ్యామిలీ అంతా చూసే లక్షణాలు ఎఫ్ 2లోనే కనిపించడంతో… ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందర హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్ కి బాటలు వేసుకున్నాడు అనిల్. ఇప్పుడు ఈ యువ దర్శకుడికి బోలెడంత డిమాండ్. వరుసగా మూడు సినిమాలు తన బ్యానర్లోనే తీసి.. అనిల్ రావిపూడిని ఫుల్‌గా వాడేసుకున్న దిల్‌రాజు కి ఇప్పుడు ఈ యువ సంచలనాన్ని వదులుకోవాలనిపించడం లేదు. ముందుగా అనుకున్న ప్రకారం.. అనిల్ ఇప్పుడు బయటి బ్యానర్లో ఓ సినిమా చేయాలి. కానీ… దిల్‌రాజు మాత్రం `నాలుగో సినిమా కూడా నాతోనే చేయ్` అని పట్టుబడుతున్నాడట. కానీ… అనిల్ మాత్రం బయటి నిర్మాతలతోనూ పని చేయాలని భావిస్తున్నాడట. అన్ని సినిమాలూ దిల్‌రాజు బ్యానర్లోనే చేస్తే.. ఆ కాంపౌండ్లోనే ఉండిపోతాడేమో అన్న ఫీలింగ్ బయటి నిర్మాతలకు కలుగుతుంది. అందుకే.. ఈ సినిమా కోసం కాస్త బయటకు రావాలనుకుంటున్నాడు. ఇప్పటికే చాలామంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చి అనిల్ కోసం ఎదురు చూస్తున్నారు.
దిల్‌రాజు మాత్రం అనిల్‌కి మళ్లీ లాక్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పెద్ద హీరోని తీసుకొచ్చి అనిల్ చేతిలో పెడితే.. కనీసం హీరో కోసమైనా అనిల్ 4వ సినిమా ఒప్పుకుంటున్నాడన్నది దిల్‌రాజు ఆలోచన. ఇప్పటి వరకూ యువ కథానాయకులతో పనిచేసిన అనిల్… స్టార్ హీరోతో సినిమా అంటే.. ఇంకో పది మెట్లు పైకి ఎదుగుతాడు. అనిల్ జోరు చూస్తుంటే బడా హీరోలు కూడా అనిల్ కోసం సై అంటారు. ఆ హీరోలనే పట్టుకుంటే..దిల్‌రాజు పని సులభమైపోతుంది. అందుకే ఓ పెద్ద హీరోతో అనిల్ ని కమిట్ చేయించాలని దిల్‌రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఆ హీరో ఎవరన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది.