తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అనే ప్రశ్నకు ఇంకా జవాబు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియని పరిస్థితి! సంక్రాంతి పండుగ తరువాత అన్నారు… ఇప్పుడా డెడ్ లైన్ కూడా దాటిపోయింది. అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైపోయాయి. ఈ సమావేశాల సమయంలోనే కనీసం ఓ ఏడు లేదా ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇస్తారనే ప్రచారమూ ఈ మధ్య వినిపించింది. పాక్షికంగా కొన్ని కీలక శాఖలకు మంత్రులను ఎంపిక చేసి, లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తి క్యాబినెట్ కూర్పు ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడా చర్చే పార్టీ వర్గాల్లో వినిపించడం లేదు. కేసీఆర్ నిర్ణయం ఏంటి అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది.
అసెంబ్లీ సమావేశాలు ముగియగానే, ఈనెల ఆఖరి వారంలో అంటే… 27 లేదా 28 తేదీల్లో ఓ ఏడెనిమిది మంది మంత్రులతో ప్రమాణ స్వీకారాలు చేయించే అవకాశం ఉందనే కథనం ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది. అయితే, దీనిపై కూడా తెరాస ఎమ్మెల్యేలే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదిగో ఇదిగో అంటూ మంత్రి వర్గ విస్తరణపై ఇప్పటికే దాదాపు ఓ పది తేదీలు వినిపించాయనీ, ఇది కూడా అంతే అనే నైరాశ్యం అధికార పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో వినిపిస్తున్న మరో కథనం ఏంటంటే… తెరాసలో కొత్త చేరికల తరువాత విస్తరణ ఉంటుందని!
కాంగ్రెస్, టీడీపీ నుంచి నేతలు తెరాసలోకి వచ్చేస్తున్నారన్న ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది. అయితే, కాంగ్రెస్ నుంచి ఓ నలుగురు ఎమ్మెల్యేలు త్వరలో వస్తారనే తెరాస వర్గాలు ఇప్పుడూ అంటున్నాయి. వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంతమంది నాయకులతో తెరాస చర్చలు కొనసాగిస్తోందనీ అంటున్నారు. టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య కూడా బయటకి వచ్చేస్తారనే ప్రచారమూ ఉంది. అలాంటిదేదీ లేదని సండ్ర చెప్పినా… తెరాసలో చేరిక దిశగానే ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. అయితే, చేరికల కార్యక్రమం గ్రామ పంచాయతీ ఎన్నికల తరువాత ఉంటుందని అంటున్నారు. కాబట్టి, ఆ తరువాతే మంత్రి వర్గ విస్తరణపై కూడా స్పష్టత వస్తుందనే ప్రచారమూ ఉంది. నాయకుల చేరికల తరువాతే విస్తరణ ఉంటుందనేది ప్రస్తుతం కనిపిస్తున్న డెడ్ లైన్. అయితే, ఇతర పార్టీల ఎమ్మెల్యేల రాకకోసమే విస్తరణ ఆపుతున్నారా… వారు రాకపోవడం వల్ల వాయిదా పడుతోందా అనేదే చర్చనీయాంశం.