ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల అధినేతలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న అంచనాలతో ఇప్పటి నుండే కంగారు పడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మిగతా బృందాన్ని మాత్రం పంపిస్తున్నారు. అదే సమయంలో.. లండన్‌లో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా…. బ్రిటన్ పర్యటన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా.. చివరి క్షణంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు.. ఓ సారి లండన్ వెళ్లిన ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత వెళ్లాలనుకున్నారు. కానీ ఎన్నికల ఫీవర్ పట్టేసింది.
కేటీఆర్‌తో లోటస్‌పాండ్‌లో జరిగిన చర్చల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. ప్రజలపై.. ఆ మీటింగ్ ప్రభావం తీవ్రంగా ఉందన్న చర్చ నడుస్తోంది. అది పాజిటివ్ నా.. నెగటివ్ నా… అన్నది వైసీపీ సీనియర్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. పరిస్థితి తేడాగానే ఉందని గమనించిన జగన్.. కీలకమైన సమయంలో పది రోజుల పాటు తాను రాజకీయాలను పట్టించుకోకపోతే… మొత్తానికే తేడా వస్తుందేమోనన్న సందేహంతో.. జగన్మోహన్ రెడ్డి… ఏం జరిగినా.. డిఫెండ్ చేసుకోవడానికి తాను అందుబాటులో ఉండటమే మంచిదన్న భావనకు వచ్చారు. పార్టీ సీనియర్ నేతలు కూడా అదే చెప్పడంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా… దావోస్ పర్యటన వాయిదా వేసుకోవడంతో.. అనూహ్య రాజకీయ పరిణామాలు ఏమైనా జరిగినా జరగొచ్చన్న ఉద్దేశానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఏపీలో రాజకీయాలు.. ఎన్నికల షెడ్యూల్ రాక ముందే హీటెక్కాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగడం.. అక్కడ ఎన్నికల ఫలితాలు.. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తూండటమే దీనికి కారణం అన్న అభిప్రాయం ఉంది. లెక్క ప్రకారం ఫిబ్రవరి చివరి వారం లేదా .. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ లోపు అధినేతలిద్దరూ.. మరింత రసవత్తరమైన పోటాపోటీ రాజకీయ వ్యూహాలు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.