విశాఖ విమానాశ్రయంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు దాడి ఘటనలపై… ఎన్ఐఏ విచారణ ప్రారంభించి చాలా రోజులవుతోంది. నిందితుడు జానపల్లి శ్రీనివాసరావును… ఏడురోజుల పాటు కస్టడీకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించేసరికి అలసిపోయింది. రెండు రోజులు ఉండగానే.. సరెండర్ చేసేసింది. ఎంతగా ప్రశ్నించినా చెప్పిందే చెబుతూండటంతో… మీడియాకు అందివ్వడానికి కూడా.. ఎన్ఐఏకు ఎలాంటి మసాలా పాయింట్లు దొరకలేదు. దాంతో… వారి దృష్టి ఇప్పుడు… ఇప్పటి వరకూ ఏపీ పోలీసులు చేసిన విచారణపై పడింది. ఈ రికార్డులు ఇస్తే… తాము మరింత చురుగ్గా విచారణ చేసుకుంటామంటున్నారు. కానీ ఏపీ పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. కేసు రికార్డులు ఇచ్చే ప్రశ్నే లేదంటున్నారు. దీంతో… ఎన్ఐఏ అధికారులు అవి ఇప్పించాలంటూ.. కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
శాంతిభద్రతల అంశం.. రాష్ట్రాల పరిధిలోనిది. అయితే.. కేంద్రం.. కోడికత్తి కేసు విషయంలో.. ఎక్కువ చొరవ తీసుకుంది. కోర్టులో విచారణలో ఉండగానే… ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చి ఉన్నట్లయితే.. ఏపీ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కానీ… కేంద్రం.. కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగలేదు. కేంద్రం… ఎన్ఐఏకు ఇచ్చేసింది కాబట్టి ఇక తాము ఏమి ఆదేశాలిస్తామని హైకోర్టు కూడా లైట్ తీసుకుంది. కానీ కేంద్రం తమ అధికారాల్లో వేలు పెడుతోందని భావిస్తున్న ఏపీ.. ఎన్ఐఏకు సహకరించడం లేదు. దాంతో ప్రతి అంశానికి ఎన్ఐఏ అధికారులు కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. నిందితుడ్ని అప్పగించడం కూడా కోర్టు ఆదేశాలతోనే జరిగింది. ఇప్పుడు… కేసు రికార్డులు కావాలంటూ.. కూడా ఎన్ఐఏ కోర్టుకెళ్లింది.
నిజానికి ఎన్ఐఏకు .. స్వతంత్రంగా దర్యాప్తు చేయడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నిందితుడు చెప్పిన దాని ప్రకారం.. సొంతంగా సోదాలు నిర్వహించి… సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉంది. కానీ ఎన్ఐఏ మాత్రం… ఏపీ పోలీసులు విచారణ జరిపి సేకరించిన రికార్డులు కావాలని పట్టుబడుతున్నారు. కానీ… ఎన్ఐఏ తీరుపై… అనుమానంగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో… మాత్రం రాజీ పడేందుకు సిద్ధంగా లేదు. ఏది కూడా సొంతంగా… సహకరిస్తే.. తర్వాత దాన్నే అలుసుగా తీసుకుని.. ఇతర కేసుల్లోనూ… కేంద్రం జోక్యం చేసుకుంటుందనే అనుమానం ఏపీ ప్రభుత్వంలో ఉంది. అందుకే ఏదైనా కోర్టు ఆదేశిస్తేనే చేద్దామన్న విధానం అవలంభిస్తోంది. రాజకీయంగా విమర్శలు వచ్చినా రాజీ పడకూడదని… ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది.