సినిమాను మార్కెటింగ్ చేసుకోవడం ఓ కళ. దర్శక ధీరుడు రాజమౌళికి అది బాగా తెలుసు. తెలుగులో తీసిన ‘బాహుబలి’ని హిందీలో ఆయన మార్కెటింగ్ చేసిన విధానం ఇతరులకు టెక్ట్స్ బుక్లా నిలిచింది. తరవాత కొందరు రాజమౌళి బాటలో నడవడం ప్రారంభించారు. తెలుగు సినిమా తీసి హిందీలోనూ మార్కెట్ చేసుకోవడం పర్లేదు. కానీ, హిందీ నుంచి వచ్చిన సినిమాకు హిందీలో పబ్లిసిటీ చేయడం ఏమిటో?
అసలు వివరాల్లోకి వెళితే… తెలుగులో తమన్నా నటిస్తున్న సినిమాల్లో ‘దటీజ్ మహాలక్ష్మి’ ఒకటి. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా ‘క్వీన్’కి రీమేక్ ఇది. తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’గా రీమేక్ చేశారు. అందులో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించారు. కన్నడ రీమేక్‌లో పారుల్ యాదవ్, మలయాళం రీమేక్‌లో మంజిమా మోహన్ నటించారు. ఇందులో ముగ్గురు రాణులు కాజల్, తమన్నా, పారుల్ కలిసి ముంబై మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. హిందీ ప్రేక్షకులు కంగనా రనౌత్‌ని తప్ప మరొకర్ని ‘క్వీన్’గా ఊహించుకోలేనంతగా ఆమె అద్భుతంగా నటించారు. మెజార్టీ హిందీ ప్రేక్షకులు ‘క్వీన్’ చూశారు. హిందీలో దక్షిణాది ‘క్వీన్’ రీమేక్స్ గురించి పబ్లిసిటీ చేయడం వల్ల ఉపయోగం వుంటుందా? కాజల్, తమన్నా కలిసి తెలుగు, తమిళ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తే వుంటుంది గానీ! తెలుగు ‘క్వీన్’ దర్శకుడు మారడం కారణంగా సినిమా వార్తల్లో నిలిచింది. ఇక్కడ సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకు రావడంపై దృష్టి పెట్టకుండా హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏమిటో? ‘దూరపు కొండలు నునుపు’ అని పెద్దలు ఇందుకు అన్నారేమో!