మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ ఓ బిలియనీర్‌గా కనిపించనున్నాడు. స్నేహం, మానవత్వం, మనిషితత్వం గురించి చెప్పే కథ ఇది. ఓ విలాస పురుషుడు… మహర్షిగా ఎలా మారాడు అన్నదే కాన్సెప్ట్. ప్రథమార్థం వినోదాత్మకంగా సాగితే.. ద్వితీయార్థం కాస్త సీరియస్ ఎమోషన్స్‌తో నడవబోతోంది. అయితే ఇంట్రవెల్ బ్యాంగ్ ఈసినిమాకి అత్యంత కీలకం. అక్కడే రిషిలో మార్పు వస్తుందట. తన బాధ్యతేంటో తెలుసుకుని గమ్యం వైపుగా అడుగులు వేస్తాడట. అక్కడి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుందని తెలుస్తోంది.
మహేష్ అపర కుబేరుడు. తన కష్టం, శ్రమనే తనని ఈ స్థాయికి తీసుకొచ్చాయని నమ్ముతాడు. కానీ.. తన ఎదుగుదల వెనుక మరో బలమైన కారణం ఉందని, తన ఉన్నతికి తోడ్పడిన ఓ స్నేహితుడు ప్రస్తుతం.. కష్టాల కడలిలో ఈదుతున్నాడన్న విషయం తెలుస్తుంది. ఆ స్నేహితుడి కోసం మహేష్ పల్లెబాట పడతాడు. మహేష్‌లో మార్పు రావడానికి ఓ బలమైన సంఘటన కారణం అవుతుంది. అదే.. మహర్షి ఇంట్రవెల్ బ్యాంగ్. మహేష్ స్నేహితుడిగా నరేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ పాత్ర.. ద్వితీయార్థంలో కీలకంగా మారబోతోందట. మొత్తానికి ఓ శ్రీమంతుడు.. స్నేహం కోసం ఎంతటి త్యాగం చేశాడో చెప్పడమే మహర్షి కథ ఉద్దేశం. ఈ భావోద్వేగాలు తెరపై ఎంత పండితే.. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు చేరువ అవుతుంది.