బయోపిక్‌ల పరంపరలో వస్తున్న మరో సినిమా యాత్ర. వై.ఎస్.ఆర్ జీవిత కథ ఇది. ఎన్నికల సీజన్‌కి ముందు ఈ సినిమాని విడుదల చేస్తారు. ఈ సినిమా వెనుక వై.ఎస్. జగన్ ఉన్నాడన్నది బహిరంగ రహస్యమే. ఆయన సలహాలు, సూచనల ప్రకారమే ఈ సినిమా రూపొందుతోంది. పెట్టుబడి కూడా జగన్ వర్గీయులే పెట్టారని ఫిల్మ్ నగర్ టాక్. విడుదలకు మరో రెండు వారాల గడువు మాత్రమే ఉంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ ఇంకా ఊపందుకోలేదు. అప్ డేట్స్ కూడా అంతంతమాత్రంగానే బయటకు వస్తున్నాయి.
కనీసం సాక్షి దినపత్రిక కూడా ఈ సినిమాని పట్టించుకోకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది. వైఎస్‌ని దేవుడిగా చూపించుకునే పత్రిక… వైఎస్ జీవితంపై ఓ సినిమా వస్తోందంటే ఎంత హడావుడి చేయాలి..? కానీ ముందు నుంచీ ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ సాక్షిలో అంతంత మాత్రంగానే వస్తోంది. ఇది తమ సినిమా అనే ముద్ర ఉండకూడదని సాక్షి జాగ్రత్త పడుతుందా అనేది అర్థం కావడం లేదు. అది వైఎస్ జగన్ సినిమా అనే ముద్రతో ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఈ సినిమాకి తగినంత ప్రచారం కల్పించడం లేదు. మొత్తానికి యాత్ర ప్రచారం చాలా నెమ్మదిగా సాగుతుంది. విడుదలకు ముందైనా కాస్త స్పీడందుకుంటుందేమో చూడాలి.