అంతరిక్షం ఫ్లాప్‌ని ఎఫ్ 2 విజయంతో కవర్ చేసుకున్నాడు వరుణ్‌తేజ్. ఈ హిట్టు… వరుణ్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుణ్ చేతిలో కూడా మంచి సినిమాలే ఉన్నాయిప్పుడు. కెరీర్‌ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే.. ఇక ఎలాంటి ఢోకా ఉండదు. ఇలాంటి సమయంలో అత్యుత్సాహంతో అడుగులేస్తే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవు. అందుకే.. ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని కథల విషయంలో వరుణ్ పునరాలోచలో ఉన్నట్టు టాక్.
తమిళంలో హిట్టయిన జిగడ్తాండలో వరుణ్‌తేజ్ విలన్‌గా కనిపించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అక్కడ బాబీ సింహా చేసిన పాత్రలో ఇక్కడ వరుణ్ కనిపించనున్నాడు. విలన్‌కి తగిన బాడీ, లుక్… వరుణ్ లో ఉన్నాయి. నటుడిగా తనలోని మరో కోణాన్ని బయటకు తీసే అవకాశం వచ్చినట్టే. కానీ ఈ సినిమా విషయంలో ఇప్పుడు వరుణ్ తర్జన భర్జనలు పడుతున్నాడట. ఇలాంటి సమయంలో విలన్‌గా కనిపించడం అంత సబబైన నిర్ణయం కాదని, ఎఫ్ 2 విజయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని నాగబాబు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో.. వరుణ్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు సమాచారం. ఇది జిగడ్తాండ టీమ్‌కి కాస్త షాకిచ్చే విషయమే. వరుణ్ని ఏదోలా ఒప్పించాలని దర్శకుడు హరీష్ శంకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు, కాకపోతే.. వరుణ్ మాత్రం అంతగా ఆసక్తి చూపించడలేదని సమాచారం.