ప్రత్యేకహోదా కోసం అంటూ.. టీఆర్ఎస్ పార్టీతో కలిసి రాజకీయాలు చేసేందుకు సిద్ధమైన జగన్మోహన్ రెడ్డికి.. అన్ని వైపుల నుంచి సమాధానాలు చెప్పుకోలేని ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి. ఒకప్పుడు.. వైఎస్.. టీఆర్ఎస్ తో ఎలా ఉండేవారో చెబుతూ… అదే టీఆర్ఎస్.. వైఎస్ తో ఎలా వ్యవహరించిందో చెబుతూ.. చాలా మంది రాజకీయ విమర్శలు ప్రారంభించారు. ఇప్పుడు సమాధానాలు చెప్పాలంటూ ప్రశ్నాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. జగన్కు మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులపై జగన్ ఎందుకు స్పందించలేని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు వైసీపీ నేతలేనని.. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, మచ్చుమర్రి ప్రాజెక్టులను నిలిపివేయాలని.. కేంద్రానికి హరీష్రావు లేఖ రాస్తే జగన్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. నవ్యాంధ్రను ఎడారిగా మార్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని వారికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. తేనె పూసిన కత్తిలా వంచన, మోసం, దగాతో ..
రాష్ట్రానికి జగన్ చారిత్రక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
మరో వైపు.. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ ఏపీలో… కొత్త ఉద్యమం ప్రారంభించారు. వైయస్ పై అభిమానంతో ఆయన పేరుతో పార్టీ స్థాపించానని ..రాష్ట్రం విడిపోయాక వైసీపీని తెలంగాణ లో విస్మరించారని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రాష్ట్ర విభజనకు కారకుడని, రాజశేఖర్ రెడ్డిని అనేకసార్లు దూషించిన వ్యక్తని ..ఈ రోజు జగన్ స్వలాభం కోసం కేసీఆర్ తో జత కట్టారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ తో జత కట్టడంతో తెలంగాణ లో అనేకమంది రాజకీయ జీవితం నాశనం అయిందని.. తెలంగాణలో వైకాపా శ్రేణులను పట్టించుకోకుండా జగన్ ఒంటెత్తు పోకడలకు పోయారన్నారు. కేసీఆర్ తో కాలవడాన్ని ప్రశ్నించినందుకు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని..భేషరతుగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ తో కూడిక మీ తండ్రి వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదంటున్నారు. వైయస్ ఆశయాల కోసం తన పార్టీ ని జగన్ కు అప్పగించానని ఆ ఆశయాలకు వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నారంటున్నారు.
దీనికి నిరసనగా 25 వ తేదిన నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్ని వైపుల నుంచి టీఆర్ఎస్ తో ములాఖత్ విషయంలో జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.