‘ఎఫ్ 2’ థియేటర్లలో ప్రేక్షకులు నవ్వి నవ్వి కన్నీళ్లు పెట్టుకుంటుంటే… వారి కళ్లలో ఆనందాన్ని చూసిన తనకు కన్నీళ్లు వచ్చేశాయని ‘విక్టరీ’ వెంకటేష్ అన్నారు. సంక్రాంతికి విడుదలైన సినిమా ఘన విజయం సాధించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. సంక్రాంతి విజయాలు వెంకీకి అలవాటే. ఆయన హీరోగా నటించిన ‘బొబ్బిలి రాజా’, ‘చంటి’, ‘ప్రేమించుకుందాం రా’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ తదితర చిత్రాలు సంక్రాంతికి విడుదలై విజయాలు సాధించాయి. అయితే.. చాలా రోజుల తరవాత తాను వినోదం పండించిన సినిమా విజయం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని వెంకటేష్ అన్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ‘ఎఫ్ 2’తో కలిపి ఇప్పటి వరకూ 31 చిత్రాలు వచ్చాయి. అన్ని సినిమాల్లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సినిమా ‘ఎఫ్2’ అని దిల్ రాజు ప్రకటించారు.