తెలంగాణ సీఎల్పీ నేతగా సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క పేరును హైకమాండ్ ఖరారు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక లేఖను కూడా ఏఐసీసీ విడుదల చేసింది. దీంతో గడచిన రెండ్రోజులుగా.. సీఎల్పీ నేత ఎవరు అవుతారనే చర్చకు తెరపడింది. గురువారం జరిగిన సీఎల్పీ భేటీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి, ఈ ఎంపిక ఏకగ్రీవం అవుతుందేమో అనుకున్నారుగానీ.. పార్టీలో అలాంటి పరిస్థితి కనిపించలేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వేణుగోపాల్ రావాల్సి వచ్చింది. చర్చల తరువాత ఇక్కడి నేతలతో ఒక తీర్మానం ఆయన చేయించారు. సీఎల్పీ నాయకుడి ఎంపికపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామంటూ తీర్మానించారు. దీంతో హైకమాండ్ పని మరింత సులువైందని చెప్పొచ్చు. ఫైనల్ గా సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క పేరుకి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టిక్ పెట్టారు.
నిజానికి, సీఎల్పీ నేతగా భట్టితోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోటీ పడ్డారు. అయితే, భట్టికి ఉన్న అనుభవం ఆయనకి సానుకూల అంశమైంది. గతంలో ఉప సభాపతిగా పనిచేశారు. కాబట్టి, సభా వ్యవహారాలపై ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇతర కాంగ్రెస్ నేతలతో పోల్చితే, ఆయన ఆచితూచి స్పందిస్తారూ, భావోద్వేగాలకు లోనుకాకుండా మాట్లాడతారనే ఇమేజ్ కూడా ఉంది. ఇంకోటి.. భట్టిని ఎంపిక చేయడంపై కూడా టి. కాంగ్రెస్ నేతల్లో అంతగా అసంతృప్తి కనిపించే అవకాశమూ లేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇప్పటికే ఒక వర్గం తీవ్రమైన అసంతృప్తి ఉన్న సంగతీ తెలిసిందే. కాబట్టి, ఉత్తమ్ కి ఈ బాధ్యతలను ఇస్తే… పార్టీలో అదో చర్చనీయాంశంగా మారే అవకాశాలే ఎక్కువ. సామాజిక సమీకరణాల లెక్కల్లో చూసుకున్నా… రెడ్డి సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాబట్టి, దళిత సామాజిక వర్గానికి టి. కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా భట్టి ఎంపిక జరిగిందనేది స్పష్టంగానే కనిపిస్తోంది. దీంతో సామాజిక న్యాయం పాటించామనే సంకేతాలు ఇచ్చినట్టూ అయింది.