తెలంగాణలో తెలుగుదేశం ఉనికి లేకుండా చేయాలనేది తెరాస అప్రకటిత లక్ష్యాల్లో ఒకటి అనేది వేరే చెప్పాల్సిన పనిలేదు! అసెంబ్లీ ఎన్నికల తరువాత, గెలిచిన ఆ ఇద్దర్నీ సైకిల్ దింపేద్దాం అనే ఉద్దేశంతో తెరాస పావులు కదుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రముఖంగా వినిపించిన పేరు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఆయనతోపాటు మరో టీడీపీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా పార్టీ మారిపోవడం ఖాయమని ఈ మధ్య చాలా కథనాలే వినిపిస్తున్నాయి. దీంతో తాను ఎక్కడికీ వెళ్లేది లేదనీ, టీడీపీలోనే ఉంటానని సండ్ర వివరణ ఇచ్చారు. అయితే, గడచిన కొద్దిరోజులుగా సండ్ర వ్యవహారం చూస్తుంటే సైకిల్ దిగడం ఖాయమనే అనిపిస్తుంది.
సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది! కనీసం ఫోన్ లైన్లో కూడా అందుబాటులో లేరని సమాచారం. గురువారం రాత్రే ఆయన సత్తుపల్లి నుంచి హైదరాబాద్ వచ్చినట్టు స్థానికంగా ప్రచారం జరిగిందట! కానీ, ఈయన హైదరాబాద్ చేరుకోలేదనీ, సత్తుపల్లిలో కూడా లేరని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు కొంత సస్పెన్స్ గా మారింది. ఇంకోటి… తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకి వీరాభిమాని అని సండ్ర చెప్పుకుంటారు. అలాంటి వీరాభిమాని ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఈసారి పాల్గొనలేదు. అంతేకాదు, తెలుగుదేశం శాసన సభ్యుడిగా ఆయన ఇంకా ప్రమాణం కూడా చెయ్యలేదు. అసెంబ్లీకి ఆయన గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే… సండ్ర సైకిల్ దిగడం దాదాపు ఖాయంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. సండ్రతోపాటు, మరో ఎమ్మెల్యే నాగేశ్వరరావు కూడా తెరాస ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారనీ, పదవులకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయంటూ కథనాలు వినిపిస్తున్నాయి. నిజానికి, తెలంగాణలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడం అనేది టి. టీడీపీకి సవాలే. వీరు ఉంటే అసెంబ్లీలో పార్టీ తరఫున వాయిస్ ఉంటుంది. ఇప్పుడీ ఇద్దరూ చేజారితే… అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండాపోతుంది. వాస్తవానికి, తెరాస లక్ష్యం కూడా అదే. అసెంబ్లీలో పరిపూర్ణమైన సంఖ్యాబలం ఉంచుకుని కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేల కోసం తెరాస పాకులాడుతోందంటే… కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణి అనడంలో సందేహం ఏముంది..?