ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు… ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. కేసీఆర్ ప్రయత్నాలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. సీరియస్‌గా తీసుకునేలా కేసీఆర్ కూడా వ్యవహరించడం లేదు. కానీ కేసీఆర్ వేస్తున్న అడుగులు విశ్లేషిస్తే… ఫ్రంట్ ప్రయత్నాలు.. బీజేపీకి వ్యతిరేకంగానో.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానో కాదు… చంద్రబాబుకు వ్యతిరేకంగానే అనేది.. తేలిపోతుంది. చంద్రబాబు ఎప్పుడైతే.. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారో.. అప్పటి నుంచి… చంద్రబాబుపై కేసీఆర్ నే బీజేపీ ప్రయోగిస్తోందనడానికి ఇప్పటి వరకూ ఉన్న పరిణామాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
చంద్రబాబు కూటమి ప్రయత్నాలపై అమిత్ షా అస్త్రమే ఫెడరల్ ఫ్రంట్..!
బీజేపీ ఈ సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మిత్రులు తప్పనిసరి. జాతీయ స్థాయిలో బీజేపీకి మిత్రులు తగ్గిపోయారు. ఎన్నికల తర్వాత కూడా.. మోడీ ప్రధాని అభ్యర్థి అయితే.. ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. బీజేపీకి ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకమయ్యాయి. ఈ పార్టీలన్నింటినీ చంద్రబాబు కలిపి ఉంచగలరు. గతంలో అదే చేశారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయించగలిగారు. ఆ కోణంలోనే.. చంద్రబాబును వీలైనంత బలహీనం చేస్తేనే… 2019 ఎన్నికల తర్వాత… ఢిల్లీ రాజకీయాలు తమ అదుపాజ్ఞల్లో ఉంటాయని బీజేపీ నేతలు అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా చేయాలంటే.. చంద్రబాబును కట్టిడి చేయాలి. ఆ బాధ్యతను.. కేసీఆర్ కు బీజేపీ అగ్రనాయకత్వం ఇచ్చిందనే అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి… ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు విశ్లేషిస్తే.. ఇదే నిజం అనిపించక మానదు..
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రత్యేకహోదా చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్డీఏలో టీడీపీ ఉన్నప్పుడు… హోదా పేరు లేకుండా ప్యాకేజీ ఇస్తామన్నా.. నిధులు అవసరం కాబట్టి చంద్రబాబు అంగీకరించారు. కానీ ఇదంతా బీజేపీ ప్లాన్‌లోనే జరిగింది. బీజేపీ హోదా ఇవ్వలేదు కానీ.. వైసీపీ, జనసేన లాంటి పార్టీలతో… ఉద్యమాలను ప్రొత్సహింపచేసింది. ఈ కుట్రలను గుర్తించిన టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని పోరాటం ప్రారంభించిందో… అప్పుట్నుంచే సెంటిమెంట్ గా మారిపోయింది.
వైసీపీ, టీఆర్ఎస్ మాత్రమే కూటమిలో ఉంటాయా..?
టీడీపీ లేకపోతే వైసీపీ ఉందనుకున్న బీజేపీకి… మారిపోయిన పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పుడు వైసీపీకి బలం రావాలంటే.. హోదా అంశంలో పాజిటివ్ ఇమేజ్ వైసీపీకి ఉండాలి. అందుకే.. కేసీఆర్‌ను ప్రయోగించారు. రెండో సారి గెలిచిన తర్వాత కేసీఆర్… ఒడిషా మీదుగా కోల్ కతా వెళ్లి అక్కడ్నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో ఆయన ఓ మాట అన్నారు.. అదే .. ఏపీకి ప్రత్యేకహోదాకు తాము అడ్డమేం కాదని. దాంతో అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో ప్రత్యేకహోదా అంశాన్ని ఓ సెంటిమెంట్ మార్చి.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం అంటే.. తెలంగాణను బొంద పెట్టడమేనని.. ప్రతీ ప్రచారసభలో చెప్పిన కేసీఆర్.. ఇలా ఒక్క సారిగా ఏపీకి ప్రత్యేకహోదాకు తాము సానుకూలం అని చెప్పడం.. అదీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడంతో… ఫెడరల్ ఫ్రంట్ గురి ఏమిటో రాజకీయ విశ్లేషకులకు అర్థమైపోతుంది. ముందుగా మాట్లాడుకున్నట్లు… అటు కేసీఆర్ ప్రకటనను… జగన్ ఆహ్వానించారు. ఏపీలో ఇరవై ఐదు, తెలంగాణలో 17 మొత్తం 42 పార్లమెంట్ సీట్లు అంటూ వరుసలు కలిపి చెప్పడంతో.. ఓ ప్లాన్ ప్రకారం ఫెడరల్ ఫ్రంట్ లో చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమైపోయింది. ఇప్పుడు.. అదే ప్రత్యేకహోదా ప్రాతిపదికగా.. చర్చలు కూడా ప్రారంభించారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ లో వైసీపీ చేరడం లాంఛనమే. మిగతా ఏ పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ లో ఉండవు. కేవలం రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి.
హోదా విషయంలో కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్పైనే జగన్‌కు నమ్మకం ఎందుకో..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకహోదా విషయంలో రాజకీయం చేయకుండా ఉండాలనుకుంటే… కాంగ్రెస్ వైపు మొట్టమొదటిగా వెళ్లేది. ఎందుకంటే.. ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్… ఇంటాబయటా చెబుతున్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి సోనియాతో చెప్పించారు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ప్రవాసులు కనిపించినా అదే చెప్పారు. ఓ విధంగా రాహుల్ గాంధీ.. తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు. పైగా… కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నపార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ కాకపోతే కాంగ్రెస్. అంతే తప్ప… ఏ ఇతర ప్రాంతీయ పార్టీ అధికారం చేపట్టలేదు. ఈ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ అయినా మద్దతివ్వాలి.. లేదా కాంగ్రెస్ మద్దతయినా తీసుకోవాలి. ఇంత క్లారిటీ ఉన్నప్పుడు… జగన్.. టీఆర్ఎస్ ను ఎలా నమ్ముతున్నారు..? తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతుందని ఎలా నమ్ముతున్నారు..?
–సుభాష్