మార్చి మొదటి వారంలో ఎన్నికల ప్రకటన రాబోతోందని… కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఢిల్లీ మీడియా సంస్థలకు ఓ అనధికారిక సూచన అందింది. ఆరేడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని… అసెంబ్లీల కాలపరిమితి ముగియబోతున్న.. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని… ఈసీ వర్గాలు .. చెప్పుకొచ్చాయి. ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమీ లేదు. గత రెండు, మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయింది. కచ్చితంగా అలా విడుదల చేస్తేనే.. దేశవ్యాప్తంగా.. సరిగ్గా సమయానికి ఎన్నికలు నిర్వహించగలుగుతారు. కానీ.. ఈసీ ప్రత్యేకంగా మీడియాకు ఎందుకు సమాచారం “విశ్వసనీయంగా” అందించాల్సి వచ్చిందో చాలా మందికి సులువుగానే అర్థమయింది.
ఎన్నికల సంఘం రాజ్యాంగం ప్రకారం.. స్వతంత్రమైనదే. కానీ… వాస్తవంగా మాత్రం కేంద్రప్రభుత్వం చేతుల్లోని కీలు బొమ్మ. ఆ విషయం ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. తాజాగా… ఇప్పుడు.. బీజేపీకి అనుకూలంగా ఉండేలా… విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చేలా… ఎన్నికల ప్రకటన కొంత మందుగానేవిడుదల చేయవచ్చన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఓ వైపు.. రైతుల కోసం.. మధ్యతరగతి కోసం… కేంద్రం శరవేగంగా తాయిలాలు రెడీ చేస్తోంది. వాటిని ప్రకటించగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలా.. చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే కేంద్రం… శరవేగంగా తాయిలాల పనులు చేస్తోందని చెబుతున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ప్రకటన చేస్తారని చెబుతున్నారు. విపక్ష పార్టీలు ఇంకా… సమైక్యం కాలేదు. బీజేపీని వ్యతిరేకించే విషయంలో ఏక తాటిపైన ఉన్నా… కాంగ్రెస్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా లేరు. ఈ గందరగోళంలో విపక్షాలు ఉండగానే పని చక్కబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల ప్రకటన ఏ క్షణమైనా రావొచ్చనడానికి… ఈసీ తీసుకున్న కొన్ని హడావుడి నిర్ణయాలే కారణం. ఎలాంటి ఆరోపణలు లేకపోయినప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల్ని మార్చేయడం.. భారీగా ఆరోపణలు ఉన్నప్పటికీ… నిర్వహణలో వైఫల్యం చెందిన విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ ఎన్నికల అధికారి జోలికి వెళ్లకపోవడం… ఉన్న పళంగా… సుదీర్ఘంగా పని చేస్తున్న అధికారుల్ని… బదిలీ చేయాలని.. రాష్ట్రాలను ఆదేశించడంతో.. ఈసీ ఓ ప్లాన్ ప్రకారమే చేస్తోందన్న అభిప్రాయం వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావొచ్చని… విపక్షాలను గందరగోళానికి గురి చేసే వ్యూహమే.. ఈసీ నుంచి వచ్చిన తాజా లీక్‌లో ఉందంటున్నారు.