సినిమా సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా మహేశ్‌బాబు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చేస్తున్న హ్యాండ్సమ్ హీరో, ఈ సినిమా తరవాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. సుకుమార్ సినిమా తరవాత ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయనున్నాడు. ఎప్పటి నుంచో కథ విషయంలో మహేశ్, సందీప్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఓ కొలిక్కి వచ్చాయి. మహేశ్ కోసం క్రైమ్ డ్రామా కథను సిద్ధం చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఆల్రెడీ కథను హీరోకి వినిపించడం, హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయని తెలుస్తుంది. ‘బిజినెస్‌మేన్’ తరవాత క్రైమ్ బేస్డ్ సినిమా మహేశ్ చేయలేదు. ‘వన్ నేనొక్కడినే’ సైకలాజికల్ థ్రిల్లర్ అయితే.. ‘స్పైడర్’ స్పై థ్రిల్లర్. ఇటీవల సామాజిక, రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేస్తున్న మహేశ్‌కి క్రైమ్ డ్రామా అంటే కొత్తగా వుంటుందనడంలో సందేహం లేదు. కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ సినిమా ప్రారంభం కావడానికి సమయం పట్టేలా వుంది. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ షూటింగులో సందీప్ రెడ్డి వంగా బిజీ. మహేశ్ కూడా ‘మహర్షి’ చేస్తున్నాడు. ఆ తరవాత సుకుమార్ సినిమా చేస్తాడు. సుకుమార్ సినిమా అయిన తరవాతే సందీప్ రెడ్డి సినిమా ప్రారంభిస్తాడట!