ఆర్.ఎక్స్100 విడుదల కాగానే…. దర్శకుడు అజయ్ భూపతిపై కర్చీప్ వేసిన హీరోల్లో… రామ్ కూడా ఉన్నాడు. రామ్ – అజయ్ భూపతి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య సిట్టింగులు కూడా అయ్యాయి. ఓ కథ ఓకే చేసుకున్నారు. కానీ సడన్‌గా ఆ సినిమా పక్కన పెట్టి పూరితో `ఇస్మార్ట్ శంకర్`ని పట్టాలెక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్. ఈమధ్య రామ్ – అజయ్ భూపతికి మధ్య ఏం జరిగిందన్న విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది.
అజయ్ భూపతి చెప్పిన కథని ఓకే చేసిన రామ్, స్క్రిప్టు దశలో కొన్ని మార్పులూ చేర్పులూ సూచించాడట. వాటిపై రామ్ – అజయ్‌లు తర్జనభర్జనలు పడ్డారని తెలుస్తోంది. రామ్ చెప్పిన మార్పులకు అజయ్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఈగో క్లాషెష్మొదలయ్యాయని సమాచారం. రామ్ తన తదుపరి సినిమాని పూరితో ప్రకటించేసరికి.. అప్పటికప్పుడు అదే కథని బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓకే చేయించేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు బెల్లంకొండతో చేయబోతున్న సినిమా కథ.. రామ్ కోసం తయారైనదే. అలా రామ్ వదులుకున్న కథ.. బెల్లంకొండ కు చేరింది. బెల్లం మాత్రం.. ఈ స్క్రిప్టులో ఒక్క మార్పు కూడా చెప్పకుండా ఓకే చేసేశాడట. హీరో అన్నాక, అదీ కాస్త పేరొచ్చాక కొన్ని మార్పులు చెప్పడం సహజమే. తొలి సినిమాకే హిట్టు కొట్టిన అజయ్.. ఈ విషయంలో సర్దుబాటు చేసుకుంటే – ఫామ్ లో ఉన్న హీరో దొరికేవాడు. ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న బెల్లంకొండతో సర్దుకుపోవాల్సివస్తుంది.