ఇది వరకు హీరోలు తక్కువ – దర్శకులు ఎక్కువ. అందుకే.. సినిమాలు స్లోగా ముందుకు వెళ్తుండేవి. ఇప్పుడు హీరోలు ఎక్కువైపోయారు. దర్శకులూ ఎక్కువైపోయారు. అందుకే సినిమా నిర్మాణాల సంఖ్య బాగా పుంజుకుంది. అయితే కొంతమంది దర్శకులకు హీరోలు దొరకడం లేదు. కొత్త దర్శకుల మాట అటుంచితే – చేతిలో కథలు పెట్టుకుని, ట్రాక్ రికార్డు బాగున్న దర్శకులదీ ఇదే పరిస్థితి.
మారుతి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తన దగ్గర బౌండెడ్ స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. కానీ సరైన హీరో దొరకడం లేదు. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేద్దామని తెగ ప్రయత్నించిన మారుతి… బన్నీ -త్రివిక్రమ్‌తో ఫిక్సయిపోవడంతో మరో ఆప్షన్ వేటలో పడ్డాడు. శ్రీకాంత్ అడ్డాల కూడా అంతే. గీతా ఆర్ట్స్ కి ఆయనో సినిమా చేయాలి. అడ్వాన్సు కూడా తీసేసుకున్నాడు. కథ రెడీగా ఉంది. కానీ హీరోనే లేడు. శర్వా, నాని… ఇలా యువ హీరోల చుట్టూ రౌండ్లు కొట్టినా పని అవ్వడం లేదు. వినాయక్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆయనో స్టార్ డైరెక్టర్. ఖైది నెం.150 లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్టు కొట్టారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. చేస్తే ఆయన పెద్ద హీరోతోనే చేయాలి. వాళ్లెవ్వరూ ఖాళీగా లేరు. దాంతో.. ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలెక్కించలేకపోతున్నారు. హరీష్ శంకర్ పరిస్థితి కూడా అంతే. దాగుడు మూతలు కథ రాసుకున్నా.. హీరోలు దొరకడం లేదు. జిగడ్తాండని పట్టాలెక్కిద్దామనుకున్నారు. అదీ.. ఓ పట్టాన తేలడం లేదు. కొండా విజయ్ కుమార్ (గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్), డాలీ (గోపాల గోపాల), శ్రీవాస్ (సాక్ష్యం) లాంటి దర్శకులు కూడా కథలతో సిద్ధంగా ఉన్నారు. వాళ్ల చేతుల్లో నిర్మాతలున్నా.. హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో.. వాళ్ల కథలన్నీ స్క్రిప్టుల దగ్గరే ఆగిపోయాయి.