`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కి సంబంధించిన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే… రాజేంద్రప్రసాద్ నిలబడినప్పుడు మాత్రం జయసుధ రంగ ప్రవేశం చేయడంతో.. పోటీ ఏర్పడింది. తొలిసారి.. ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ ఎన్నికలలో.. రాజేంద్రప్రసాద్ గెలిచి అందరినీ షాక్ కి గురి చేశారు. ఇప్పుడు మరోసారి `మా` అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం అనివార్యంగా అనిపిస్తోంది. ఈసారి కూడా `మా` అధ్యక్షుడిగా నిలబడాలని శివాజీరాజా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై పోటీ చేయడానికి నరేష్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై ఆయన సూచన ప్రాయంగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు కూడా. “ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిపించాలన్నదే మా ప్రయత్నం. కాదూ కూడదు అనుకుంటే ఎవరిపైనైనా పోటీ చేయడానికి కూడా సిద్ధమే“ అని జెండా ఎగరేశారు.
`మా` అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా.. ఒక పర్యాయం మాత్రమే ఆ పదవిలో కొనసాగాలన్నది అంతర్గతంగా పెట్టుకున్న నియమం. రాజేంద్రప్రసాద్ కూడా రెండోసారి బరిలోకి దిగలేదు. ఇప్పుడు శివాజీ రాజా కూడా స్వచ్ఛందంగా తప్పుకుంటే.. ఎన్నికలు ఏకగ్రీవంగా మారతాయి. లేదంటే.. పోలింగ్ తప్పదు.