నరేంద్రమోడీ, అమిత్ షాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది.. బీజేపీయేతర కూటమి పార్టీల నేతలందరూ.. కోల్‌కతా వేదికగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో కోల్ కతాలో నిర్వహించి ర్యాలీ బహిరంగసభ భారీ విజయం సాధించింది. ర్యాలీలో మొత్తం 20 ప్రదాన పార్టీలకు చెందిన జాతీయస్థాయి నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్, దేవెగౌడ, శరద్‌యాదవ్, కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలతో శత్రుఘ్నసిన్హా, అరుణ్ శౌరీ, జశ్వంత్ సింగ్ లాంటి బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
సేవ్ ఇండియా.. సేవ్ డెమోక్రసీ అనేది అందరి నినాదమని.. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
నాలుగేళ్ల బీజేపీ పాలనలో రైతులు మోసపోయారన్నారు. బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటోందని.. తాము దేశాన్ని ఏకం చేయాలనుకుంటున్నామన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాఫెల్ ఒప్పందం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు. రాఫెల్ విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం తప్పుడు అఫిడవిట్ ఇచ్చిందని.. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ వ్యవస్థలను కేంద్రం భ్రష్టుపట్టించిందన్నారు. 2019లో ప్రజలు కొత్త ప్రధానిని చూడబోతున్నారని చంద్రబాబు జోస్యం చెప్పారు. అమరావతిలోనూ విపక్షాల ఐక్య వేదిక సభ నిర్వహిస్తామని ప్రకటించారు . బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలనడంలో మరో అభిప్రాయానికి తావు లేదని ఇతర పార్టీల నేతలు ప్రకటించారు. శతృఘ్ను సిన్హా కూడా.. ఈ సభకు హాజరయ్యారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఐదేళ్లుగా దేశం చూస్తోందని.. సభకు హాజరైన ఇతర పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. దేశ మహోన్నత రాజ్యాంగంపైనా దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐలతో కూటమి కట్టి..విపక్షాలపై బీజేపీ కక్ష సాధిస్తోందని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది మరో స్వతంత్రం కోసం పోరాటంగా డీఎంకే నేత స్టాలిన్ అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ర్యాలీని ఆర్గనైజ్ చేసిన మమతాబెనర్జీ పంచ్ ఇచ్చారు. బీజేపీని ఓడించడమే కాదు… మూలాలతో పెకిలించాలని పిలుపునిచ్చారు.
కూటమి కట్టినా కట్టకపోయినా.. ఎన్నికల ముందు.. బీజేపీపై వ్యతిరేకత చూపడంలో పార్టీలన్నీ కలసి కట్టుగా వ్యవహరించాయి. ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నకు తావు లేకుండా.. ఎవరు ఎక్కువ… ఎవరు తక్కువ అనే వాదానికి చాన్స్ లేకుండా.. విపక్షాల రణభేరీని తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించారు. నిజానికి తానే ప్రధానమంత్రి అభ్యర్థిని అని కొంత కాలం కిందట ప్రకటించుకున్నారు. అంతకు ముందు స్టాలిన్ కూడా.. రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి అన్నారు. అయినప్పటికీ.. ఇలాంటి విబేధాలేమీ గుర్తు పెట్టుకోకుండా.. అన్ని పార్టీల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందన్న సంకేతాన్ని ప్రజలకు పంపింది. విపక్షాల తర్వాత ర్యాలీ అమరావతిలో జరగనుంది.