హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు తీసుకున్న కృతజ్ఞతకూడా లేకుండా వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతర్రాష్ట్ర వివాదానికి వైఎస్సే కారణమని ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో కడెం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ హయాంలో నాలుగువేల కోట్లు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు కడితే కాలువలు లేవని, కాలువలు కడితే ప్రాజెక్టులు లేవని అన్నారు. వారు నకిలీ ప్రాజెక్టులు కట్టారని, ఇకమీదట అలా ఉండబోవని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళ విషయంలో వైఎస్ కొంప ముంచారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్తో అంటకాగటంపై ఏపీకి చెందిన తెలుగుదేశం నేతలు తీవ్రవిమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు, ఏపీకి అన్యాయం జరగటానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీతో జట్టుకడుతున్నారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతిచ్చారని ఆరోపించారు. జగన్ దానికి బదులిస్తూ తాను ఏపార్టీతో వెళితే మీకేంటని ప్రశ్నించారు కూడా. అయితే ఇప్పుడు యాంటీ క్లైమాక్స్లాగా మద్దతు తీసుకున్న పార్టీయే తమను విమర్శించటం జగన్కు ఇబ్బంది కలిగించే విషయమే.